Asianet News TeluguAsianet News Telugu

శివాలెత్తిన సిరాజ్.. కుల్దీప్ కేక.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం.. లంకపై సిరీస్ క్లీన్ స్వీప్

INDvsSL Live: స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.  తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్.. వన్డేలలో రికార్డు విజయాన్ని అందుకుంది. 

INDvsSL 3rd ODI Live: Mohammed Siraj Takes 4fer, as Sri Lanka Collapse at 73
Author
First Published Jan 15, 2023, 7:50 PM IST

బంతిని తాకితే క్యాచ్.. వదిలిపెడితే బౌల్డ్.. ఇది తిరువనంతపురంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్  తీరు. నిప్పులు చెరిగే బంతులతో లంకకు  ముచ్చెమటలు పట్టించిన సిరాజ్ ప్రదర్శనతో.. భారత్ తిరువనంతపురం వేదికగా ముగిసిన  మూడో వన్డేలో భారీ విజయాన్ని అందుకుంది. సిరాజ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులిచ్చి ఒక మెయిడిన్ వేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.  సిరాజ్ తో పాటు కుల్దీప్, షమీ కూడా  పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో   ఈ మ్యాచ్ లో శ్రీలంక..22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది.  అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..  5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. 

391 పరుగుల లక్ష్య ఛేదనలో  లంక ఆరంభంలోనే తడబడింది.  షమీ వేసిన తొలి ఓవర్లో  సింగిల్ తీసి ఖాతా తెరిచాడు అవిష్క ఫెర్నాండో (1).   సిరాజ్ వేసిన రెండో ఓవర్లో అతడు.. స్లిప్స్ లో   శుభమన్ గిల్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  

శివాలెత్తిన సిరాజ్.. 

తన తర్వాతి ఓవర్లో  సిరాజ్.. కుశాల్ మెండిస్  (4) ను బోల్తా కొట్టించాడు.  తక్కువ ఎత్తులో వచ్చిన బంతి..  మెండిస్ బ్యాట్ ను ముద్దాడుతూ  వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ చేతిలో పడింది. తర్వాత  షమీ  మెయిడిన్ ఓవర్ వేశాడు.  

సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన నువానిదు ఫెర్నాండో   జోరు మీద కనిపించాడు. షమీ వేసిన  ఏడో ఓవర్లో మూడో బంతికి చరిత్ అసలంక  (1) అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  లంక ఇన్నింగ్స్   8వ ఓవర్లో సిరాజ్.. ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేశాడు. జోరు మీదున్న సిరాజ్.. తన తర్వాతి ఓవర్లో హసరంగ (1) ను కూడా క్లీన్ బౌల్డ్ చేయడంతో లంక ఐదో వికెట్ ను కోల్పోయింది. పది ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు.. 39-5గా ఉంది. 

కుల్దీప్ మాయ..

11వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. మెయిడిన్ ఓవర్ విసిరాడు. కానీ 12వ ఓవర్ లో సిరాజ్.. కరుణరత్నేను డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేశాడు.   ఇది రనౌట్ కిందకు వచ్చినా  వికెట్ తీసింది  సిరాజే.   వరుసగా వికెట్లు పడుతున్నా లంక మరోసారి కెప్టెన్ శనక మీదే ఆధారపడింది. అయితే  కుల్దీప్ యాదవ్ వేసిన 15వ ఓవర్ ఆఖరుబంతికి శనక (11) క్లీన్  బౌల్డ్ అయ్యాడు.  కుల్దీప్ వేసిన డెలివరీని  డిఫెన్స్ ఆడబోగా బంతి  కాస్త మిస్ అయి మిడిల్ స్టంప్ ను ఎగురగొట్టింది. అచ్చం 2019 వన్డే వరల్డ్ కప్ లో  పాకిస్తాన్   ఆటగాడు బాబర్ ఆజమ్  ఔట్ ను ఇది గుర్తుకుతెచ్చింది.   వెల్లలగె (3) ను షమీ  బౌల్డ్ చేశాడు. 16 ఓవర్లకు లంక స్కోరు  51-8. 

 

ఇక  ఐదో వికెట్ కోసం సిరాజ్ తీవ్రంగా యత్నించాడు. తన 8వ ఓవర్లో  రజిత ఇచ్చిన ఓ క్యాచ్ ను రాహుల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అదే ఓవర్లో బంతి  పైకి లేచినా అది ఫీల్డర్లు లేని చోట పడింది. దీంతో అతడికి  ఫైఫర్  దక్కలేదు. కానీ కుల్దీప్.. లాహిరు కుమార (13) ను  క్లీన్ బౌల్డ్ చేసి  లంక ఇన్నింగ్స్ కు తెరదించాడు.  ఇదే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ అషెన్ బండారా  బ్యాటింగ్ కు రాలేదు. దీంతో లంక.. 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్.. 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వన్డేలలో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతి పెద్ద విజయం.  

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.  టీమిండియా సారథి  రోహిత్ (42) రాణించగా.. శుభమన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్) లు సెంచరీలతో మెరిశారు. శ్రేయాస్ అయ్యర్ (38) ఫర్వాలేదనిపించాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios