Asianet News TeluguAsianet News Telugu

లంకకు చమటలు పట్టిస్తున్న సిరాజ్.. భారీ లక్ష్య ఛేదనలో సగం మంది ఔట్

INDvsSL Live: ఇండియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో  తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొడుతోంది.  భారత బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట లంక టాపార్డర్ కుదేలైంది. 

INDvsSL 3rd ODI Live: Mohammed Siraj Strikes, Sri Lanka Lost 6 Wickets
Author
First Published Jan 15, 2023, 7:03 PM IST

తిరువనంతపురం వన్డేలో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసిన  టీమిండియా.. తర్వాత బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తోంది.  భారత  పేసర్, హైదరాబాదీ  మహ్మద్ సిరాజ్ లంకకు చుక్కలు చూపిస్తున్నాడు. బంతి బ్యాట్ ను  తాకితే క్యాచ్ లేకుంటే బౌల్డ్ అన్నట్టుగా ఉంది సిరాజ్ బౌలింగ్.  సిరాజ్   లో పాటు షమీ కూడా ఓ చేయి వేయడంతో మూడో వన్డేలో లంక.. 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.   ప్రస్తుతం లంక.. 13 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. 

భారీ లక్ష్య ఛేదనలో  లంక ఆరంభంలోనే తడబడింది.  షమీ వేసిన తొలి ఓవర్లో  సింగిల్ తీసి ఖాతా తెరిచాడు అవిష్క ఫెర్నాండో (1).   సిరాజ్ వేసిన రెండో ఓవర్లో అతడు.. స్లిప్స్ లో   శుభమన్ గిల్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  

తన తర్వాతి ఓవర్లో  సిరాజ్.. కుశాల్ మెండిస్  (4) ను బోల్తా కొట్టించాడు.  తక్కువ ఎత్తులో వచ్చిన బంతి..  మెండిస్ బ్యాట్ ను ముద్దాడుతూ  వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ చేతిలో పడింది. తర్వాత  షమీ  మెయిడిన్ ఓవర్ వేశాడు.  

సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన నువానిదు ఫెర్నాండో   జోరు మీద కనిపించాడు. షమీ వేసిన  ఏడో ఓవర్లో మూడో బంతికి చరిత్ అసలంక  (1) అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  లంక ఇన్నింగ్స్   8వ ఓవర్లో సిరాజ్.. ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేశాడు. జోరు మీదున్న సిరాజ్.. తన తర్వాతి ఓవర్లో హసరంగ (1) ను కూడా క్లీన్ బౌల్డ్ చేయడంతో లంక ఐదో వికెట్ ను కోల్పోయింది. పది ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు.. 39-5గా ఉంది. 

 

11వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. మెయిడిన్ ఓవర్ విసిరాడు. కానీ 12వ ఓవర్ లో సిరాజ్.. కరుణరత్నేను డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేశాడు.   ఇది రనౌట్ కిందకు వచ్చినా  వికెట్ తీసింది  సిరాజే. ప్రస్తుతం లంక.. కెప్టెన్ దసున్ శనక (9 బ్యాటింగ్),  దునిత్ వెల్లలగె (1 బ్యాటింగ్) లతో ఆడుతోంది.   ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు 150 పరుగులు చేసినా గొప్పే. 

అంతకుముందు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. భారత్ తరఫున   రోహిత్ (42) రాణించగా.. శుభమన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్) లు సెంచరీలతో మెరిశారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios