Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ కొట్టిన షాట్‌కు ఇద్దరు లంక ప్లేయర్లకు గాయాలు.. స్ట్రెచర్ మీద తీసుకెళ్లిన సిబ్బంది.. ఆస్పత్రిలో చికిత్స

INDvsSL Live: ఇండియా-శ్రీలంక మధ్య  తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో   లంక ఆటగాళ్లు  ఇద్దరు గాయపడ్డారు.  బౌండరీ లైన్ వద్ద ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో వీరిని స్ట్రెచర్ మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. 

INDvsSL 3rd ODI Live: Ashen Bandara and Jeffrey Vandersay Injured After Painful Boundary Rope Collision
Author
First Published Jan 15, 2023, 6:31 PM IST

మూడో వన్డేలో భాగంగా శ్రీలంకకు చెందిన ఇద్దరు ఫీల్డర్లు గాయపడ్డారు.    సెంచరీకి ముందు విరాట్ కోహ్లీ కొట్టిన ఓ షాట్ కు ఫీల్డింగ్ చేస్తుండగా ఆషెన్ బండారా,  జెఫ్రీ వాండర్సేకు గాయాలయ్యాయి.  బంతిని ఆపే క్రమంలో ఇద్దరూ  దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి  వేగంగా ఢీకొన్నారు.  దీంతో ఇద్దరూ  అక్కడే  కుప్పకూలారు.   ఆఖరికి గ్రౌండ్ సిబ్బంది వచ్చి స్ట్రెచర్ మీద వాళ్లను తీసుకెళ్లాల్సి వచ్చింది. 

వివరాల్లోకెళ్తే..  కరుణరత్నే వేసిన భారత ఇన్నింగ్స్  43వ ఓవర్లో    ఐదో బంతికి కోహ్లీ ఆన్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు.  బంతిని ఆపే క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న  వాండర్సే, బండారాలు  వేగంగా దూసుకొచ్చారు. 

ఇద్దరూ బంతిని  ఆపడానికి యత్నించగా ఒకరిని ఒకరు ఢీకొన్నారు.  వాండర్సేకు  బండారా కాలు తగిలి అతడి మీదుగా ఎగిరిపడ్డాడు.  దీంతో ఈ ఇద్దరూ అక్కడే  కుప్పకూలిపోయారు.   కిందపడ్డాక  బండారా కడుపును పట్టుకుని ఇబ్బందిపడగా  వాండర్సే  కూడా  లేచినట్టే లేచి అక్కడే కూర్చుండిపోయాడు.  దీంతో వెంటనే స్పందించిన లంక మెడికల్ టీమ్ ఈ ఇద్దరి దగ్గరికి వచ్చి ప్రాథమిక వైద్యం అందించింది. వేగం కారణంగా దెబ్బ బలంగా తాకడంతో   ఇద్దరినీ స్ట్రైచర్ మీద పెవలియన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ  ఇద్దరూ ఫీల్డింగ్ కు రాలేదు.  ఈ ఇద్దరినీ  వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు శ్రీలంక క్రికెట్ ట్విటర్ లో వెల్లడించింది.  మరి వీళ్లిద్దరూ బ్యాటింగ్ కు అయినా వస్తారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. 

 

ఈ ఇద్దరూ పెవిలియన్ చేరాక తర్వాత బంతికే   కోహ్లీ.. సింగిల్ తీసి  సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.  87 బంతుల్లోనే  విరాట్ సెంచరీ  పూర్తయింది. వన్డేలలో కోహ్లీకి ఇది  46వ సెంచరీ కాగా మొత్తంగా 74వది.  

 

ఇక ఈ మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెచ్చిపోయి ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (49 బంతుల్లో 42,  2 ఫోర్లు, 3 సిక్సర్లు)  ఫర్వాలేదనిపించగా మరో ఓపెనర్  శుభమన్ గిల్  (97 బంతుల్లో 116, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా  వన్ డౌన్ లో వచ్చిన  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్, 13 ఫోర్లు, 8 సిక్సర్లు) లంక బౌలింగ్  ను రఫ్ఫాడించాడు.  మధ్యలో శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు 1 సిక్సర్) కోహ్లీకి అండగా నిలిచాడు. ఫలితంగా  భారత్.. నిర్ణీత  50 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios