రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ... 1683 రోజుల తర్వాత 50 కంటే తగ్గిన విరాట్ కోహ్లీ టెస్టు బ్యాటింగ్ సగటు... 

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుటైన విరాట్, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ టెస్టు సగటు 49.96కి పడిపోయింది. మూడు ఫార్మాట్లలోనూ 50+ యావరేజ్ కలిగిన ఏకైక ప్లేయర్‌గా ఉన్న విరాట్, ఆ రికార్డును కోల్పోవాల్సి వచ్చింది. 

మొదటి ఇన్నింగ్స్ అనుభవాల కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది భారత జట్టు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కలిసి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 34 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో ధనంజయకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 

అంపైర్ కాల్స్ కారణంగా హనుమ విహారి, శ్రీలంక ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడం, రివ్యూ తీసుకోకపోవడంతో రోహిత్ శర్మ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.79 బంతుల్లో 4 ఫోర్లతో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర మాథ్యూస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత కొద్దిసేపటికే 79 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన హనుమ విహారి, జయవిక్రమ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, జయవిక్రమ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడంతో 139 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టు... 5.5 ఓవర్లలో మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. 35.5 ఓవర్లలో 109 పరుగులకి శ్రీలంక ఆలౌట్ కావడంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం దక్కింది...

16 బంతుల్లో ఒక్క పరుగు చేసిన లసిత్ ఎంబూల్దేనియాని జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన లక్మల్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు... 

38 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన శ్రీలంక వికెట్ కీపర్ డిక్‌వాలా, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన విశ్వ ఫెర్నాండోని రవిచంద్రన్ అశ్విన్ స్టంపౌట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది...

ఇప్పటికే విదేశాల్లో 7 సార్లు ఐదేసి వికెట్లు తీసిన భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా... 10 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 మెయిడిన్లతో 5 వికెట్లు తీశాడు. బుమ్రాకి ఇది స్వదేశంలో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కాగా రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలకు రెండేసి వికెట్లు దక్కగాయి. అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కగా, రవీంద్ర జడేజాకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.