India vs Sri Lanka 1st t20I: ఒకే ఇన్నింగ్స్‌తో మూడు రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ మెరుపులతో లంక ముందు కొండంత లక్ష్యం...

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది... ఫామ్‌లో లేని భారత బ్యాటర్లంతా లంక బౌలింగ్‌లో ప్రతాపాన్ని చూపిస్తూ, రెచ్చిపోయారు...విండీస్‌ సిరీస్‌లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్, తుది జట్టులో చోటు దక్కించుకోలేక శ్రేయాస్ అయ్యర్... ఫామ్‌లో లేని లంక బౌలర్లను వీర బాదుడు బాది వదిలేశారు..

ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి టీమిండియాకి శతాధిక భాగస్వామ్యాన్ని అందించారు. చమీక కరుణరత్నే వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాది ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్, అదే దూకుడు కొనసాగించాడు...

30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఇషాన్ కిషన్. ఆరంగ్రేటం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కి, ఇది కెరీర్‌లో రెండో టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. 

తొలి వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ 3299 టీ20 పరుగులతో ఉంటే, అతన్ని అధిగమించిన రోహిత్ శర్మ 3307 పరుగులతో టాప్‌లో నిలిచాడు...

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3296 పరుగులతో టాప్ 3లో ఉన్నాడు. టీ20ల్లో రోహిత్ శర్మకి ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో 13 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పితే, రోహిత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 

32 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు బౌల్డ్ అయిన భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మ 14 సార్లు బౌల్డ్ అయితే శిఖర్ ధావన్ 14 సార్లు, ఎమ్మెస్ ధోనీ 13, సురేష్ రైనా 11, కెఎల్ రాహుల్ 10 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు... 


శ్రీలంక ఫీలర్డు క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన ఇషాన్ కిషన్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వెస్టిండీస్‌పై 2019లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ రికార్డును బ్రేక్ చేశాడు ఇషాన్ కిషన్...

56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, దసున్ శనక బౌలింగ్‌లో జనిత్ లియనగేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా... ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత జూలు విదిల్చారు. 19వ ఓలర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టిన శ్రేయాస్ అయ్యర్, 20వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 3 ఓవర్లలో 44 పరుగులు రాబట్టింది భారత జట్టు...