Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 3rd Test: రెండు ఓవర్లు, రెండు వికెట్లు... మరోసారి పూజారా, రహానే ఫెయిల్...

India vs South Africa: 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే మళ్లీ ఫెయిల్... మార్కో జాన్సెన్ రికార్డు ఫీట్..

INDvsSA 3rd Test: team India lost two early wickets, Cheteshwar Pujara, Ajinkya Rahane
Author
India, First Published Jan 13, 2022, 2:28 PM IST

కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఉదయం భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. ఓవర్‌నైట్ స్కోర్ 57/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. 

33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు... ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన అజింకా రహానే... కగిసో రబాడా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

వరుసగా విఫలమవుతున్నా, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసి మూడో టెస్టులో అవకాశం దక్కించుకున్న సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే మరోసారి పేలవ ప్రదర్శన ఇచ్చారు. ఈ పర్ఫామెన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వడంపై మరోసారి ట్రోలింగ్ వస్తోంది. ఇకనైనా శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ప్లేయర్లకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

వరుసగా ఫెయిల్ అవుతున్న పూజారా, రహానేలకు మళ్లీ మళ్లీ ఛాన్సులు ఇవ్వడం వల్ల టీమిండియాకి నష్టం జరుగుతోందని అంటున్నారు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆన్రీచ్ నోకియా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మార్కో జాన్సెన్... పూజారా వికెట్‌తో 17 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు జాన్సెన్...

ఇంతకుముందు 1995-96లో ఇంగ్లాండ్‌పై ఆరంగ్రేటం చేసిన షాన్ పోలాక్ 16 వికెట్లు తీయగా, ఇప్పటికే 17 వికెట్లు తీసిన జాన్సెన్... 26 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు...

రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా జట్టు 210 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ 72 పరుగులు చేయగా కేశవ్ మహరాజ్ 25, భవుమా 28, వాన్ దేర్ దుస్సేన్ 21 పరుగులు చేశారు...

భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు తీయగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలకు చెరో రెండేసి వికెట్లు దక్కాయి. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు... రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు, కెఎల్ రాహుల్ 22 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వికెట్ పడకుండా ఆడడంతో 57/2 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్‌ను ముగించింది టీమిండియా... 
 

Follow Us:
Download App:
  • android
  • ios