మరోసారి కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫెయిల్... 61 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... రిషబ్ పంత్ గోల్డెన్ డకౌట్...

సౌతాఫ్రికా టూర్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయింది. కనీసం ఆఖరి వన్డేలో అయినా గెలిచి, పరువుతో టూర్‌ను ముగించాలని చూస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కెఎల్ రాహుల్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో సీనియర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు. 73 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఫెలూక్వాయో బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...


116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రిషబ్ పంత్, గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫెలూక్వాయో బౌలింగ్‌లో మగలకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్. 118 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

63 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. తొలి వన్డేలోనూ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడం... మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టేయడం జరిగిన విషయం తెలిసిందే...

అంతేకాకుండా మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నమోదుకాగా, నేటి మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. 70 పరుగులకే 3 వికెట్లు పడిన తర్వాత క్వింటన్ డి కాక్, వాన్ దేర్ దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు...

లక్ష్యఛేదనలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 69+ వన్డేల్లో లక్ష్యఛేదనలో 50+ స్కోర్లు చేయగా, విరాట్‌కి ఇది 61వ 50+ ఛేజింగ్ స్కోరు...

వన్డేల్లో విరాట్‌కి ఇది 64వ అర్ధశతకం... హాఫ్ సెంచరీ తర్వాత బ్యాటుని బేబీలా ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ... ఇన్నాళ్లు మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా పెంచుతూ వచ్చిన విరాట్ కోహ్లీ గారాల కూతురు వామికను ఎత్తుకుని, స్టాండ్స్‌లో భర్తను అభినందిస్తూ కనిపించింది అనుష్క శర్మ...

సౌతాఫ్రికా టూర్‌లో అడుగుపెట్టిన సమయంలో టీమ్ బస్సులో అనుష్క శర్మ ఎత్తుకున్న వామిక కోహ్లీ ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ స్వయంగా మీడియాను ‘పాప ఫోటోలు వద్దని’ కోరడంతో వాటికి పెద్దగా ప్రచారం రాలేదు... అయితే వన్డే సిరీస్‌లో మాత్రం అనుష్క శర్మ, వామిక కోహ్లీని స్వేచ్ఛగా స్టాండ్స్‌లోకి తీసుకురావడం, కెమెరాల్లో, టీవీల్లో ప్రసారం కావడం జరిగిపోయాయి...