IND vs SA 2nd Test: లంచ్ బ్రేక్ విరామానికి ముందు వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా... వాన్ దేర్ దుస్సేన్ క్యాచ్‌పై అనుమానాలు...

సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా రెండో రోజు లంచ్ బ్రేక్ విరామానికి ముందు 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. 

35/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికాకి శుభారంభం దక్కింది. కెప్టెన్ డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు...

120 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన డీన్ ఎల్గర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

ఆ తర్వాత 118 బంతుల్లో 9 ఫోర్లతో 62 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో ఒక్క పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 

లంచ్ బ్రేక్‌కి ముందు సౌతాఫ్రికా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో రెండో రోజు తొలి సెషన్‌లో టీమిండియాకి ఆధిపత్యం దక్కింది. 

అయితే రస్సీ వాన్ దేర్ దుస్సేన్ అవుట్ విషయంలో వివాదం రేగుతోంది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వాన్ దేర్ దుస్సేన్ బ్యాటును తగిలి, అతని పొట్టను తాకుతూ వెనక్కి దూసుకెళ్లిన బంతిని, వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే టీవీ రిప్లైలో బంతి కింద పడిన తర్వాత బౌన్స్ అయినట్టు కనిపించింది. అయితే బంతి కింద గ్లవ్స్ ఉన్నాయా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు...

Scroll to load tweet…

అయితే సఫారీ క్రికెట్ ఫ్యాన్స్, బంతి నేలను తాకిన తర్వాతే రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడని ఆరోపిస్తుంటే... టీమిండియా ఫ్యాన్స్, లేదు... గ్లవ్స్ మీదే బంతి బౌన్స్ అయ్యిందంటూ వాదిస్తున్నారు. ఈ అవుట్ విషయంలో రేగిన వివాదం ఇరు జట్ల అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది...

అంతకుముందు మొదటి రోజు హనుమ విహారి అవుట్ విషయంలో వివాదం రేగింది. కగిసో రబాడా బౌలింగ్‌లో వాన్ దేర్ దుస్సేన్ పట్టిన క్యాచ్‌కి అవుటై పెవిలియన్ చేరాడు హనుమ విహారి. అయితే టీవీ రిప్లైలో రబాడా వేసిన ఆ బంతి నో బాల్‌గా తేలింది. రబాడా లైన్ దాటి బౌలింగ్ చేసినా ఫీల్డ్ అంపైర్ కానీ, థర్డ్ అంపైర్ కానీ గుర్తించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది...