Asianet News TeluguAsianet News Telugu

చాహల్ అరుదైన ఘనత.. భువీ రికార్డు బ్రేక్.. అత్యధిక వికెట్ల వీరుడిగా..

INDvsNZ T20I: గత కొంతకాలంగా  తన బౌలింగ్ లో మునపటి పదును  కోల్పోయిన    భారత  స్పిన్నర్ నిన్న  న్యూజిలాండ్ తో ముగిసిన  రెండో టీ20లో మాత్రం మెరిశాడు.  కివీస్ ఓపెనర్  ఫిన్ అలెన్ ను బౌల్డ్ చేసి   అరుదైన ఘనత సాధించాడు. 

INDvsNZ : Yuzvendra Chahal achieves this Elite Milestone, Breaks Bhuvneshwar Kumar Record MSV
Author
First Published Jan 30, 2023, 11:26 AM IST

టీమిండియా స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.  న్యూజిలాండ్ తో  రెండో  టీ20 సందర్భంగా ఆ జట్టు ఓపెనర్ ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా  చాహల్ ఈ రికార్డు సాధించాడు. టీ20లలో అలెన్ వికెట్  చాహల్ కు 91వది.  తద్వారా అతడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్  అత్యధిక వికెట్ల రికార్డు (90) ని బ్రేక్  చేశాడు. 

లక్నో వేదికగా ముగిసిన  రెండో టీ20లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ ను ఔట్ చేయడం ద్వారా చాహల్.. పొట్టి ఫార్మాట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (75 మ్యాచ్ లలో 91 వికెట్లు) సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత్ నుంచి  చాహల్ అగ్రస్థానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్ లలో90), అశ్విన్ (72), బుమ్రా (70), హార్ధిక్ పాండ్యా (65) తర్వాతి  స్థానాల్లో ఉన్నారు. 

అంతర్జాతీయ స్థాయిలో  న్యూజిలాండ్  పేసర్ టిమ్ సౌథీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌథీ.. 107 మ్యాచ్ లలో 134 వికెట్లు పడగొట్టాడు.  ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ (128), రషీద్ ఖాన్ (122), ఇష్ సోధి (113), మలింగ (107), షాదాబ్ ఖాన్ (98), షాహిద్ అఫ్రిది (98), ముష్ఫీకర్ రెహ్మాన్ (97), క్రిస్ జోర్డాన్ (95), అదిల్ రషీద్ (93)లు చాహల్ కంటే ముందున్నారు. న్యూజిలాండ్ ప్రస్తుత టీ20 జట్టుకు  సారథిగా ఉన్న మిచెల్ శాంట్నర్  కూడా 91 వికెట్లతో  చాహల్ తో సమానంగా నిలిచాడు.  

 

నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి  మొదట బ్యాటింగ్  చేసిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది.  నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది.  కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (19 నాటౌట్) టాప్ స్కోరర్. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్.. టీమిండియా స్పిన్నర్ల ముందు తేలిపోయింది. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, చాప్‌మన్, ఫిలిప్స్, మిచెల్, బ్రాస్‌వెల్ లు  విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ కు రెండు వికెట్లు దక్కగా హార్ధిక్ పాండ్యా,  వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్ లకు తలా ఓ వికెట్ దక్కింది.  ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత్.. 19.5  ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి  101 పరుగులు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios