Asianet News TeluguAsianet News Telugu

వంద పరుగుల కోసం చెమటోడ్చిన టీమిండియా.. ఉత్కంఠ పోరులో హార్థిక్ సేనదే గెలుపు..

INDvsNZ T20I Live: రాంచీలో ఓడినా లక్నోలో మాత్రం టీమిండియాదే పైచేయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో తొలుత  కివీస్ ను స్పిన్ ఉచ్చులో బందించిన యువ భారత్.. తర్వాత లక్ష్య ఛేదనలో తడబడ్డా ఎలాగోలా విజయాన్ని అందుకుని సిరీస్ ను సమం చేసింది. స్పిన్నర్లు తమ సత్తా చూపించిన ఈ మ్యాచ్ లో బంతి  ఊహించని మలుపులు తిరిగింది. 

INDvsNZ T20I Live: Spinners Help Team India to Beat New Zealand in Lucknow, Series Levels MSV
Author
First Published Jan 29, 2023, 10:31 PM IST

ఇండియా-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా లక్నోలో  ముగిసిన రెండో మ్యాచ్‌లో యువ భారత్ గెలిచి నిలిచింది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బౌలింగ్ లో దుమ్మురేపినా లక్ష్య ఛేదనలో స్కోరు బోర్డుకు నత్తకు నడక నేర్పింది. తొలుత కివీస్ ను బౌలింగ్ లో కట్టడి చేసిన హార్ధిక్ సేన.. తర్వాత బ్యాటింగ్ లో తడబడ్డా చివరికి ఎలాగోలా విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తర్వాత భారత్.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో  గెలుపుతో టీమిండియా.. సిరీస్ ను 1-1తో సమం  చేసింది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. 

స్పల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్ టెస్టు కన్నా దారుణంగా సాగింది.  స్పిన్ ఆడటంలో అనుభవమున్న భారత బ్యాటర్లు ఒక దశలో 8 ఓవర్ల దాకా ఒక్క ఫోర్ కొట్టలేదంటే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  అదీ ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో  అగ్రస్థానంలో ఉన్న  బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  (31 బంతుల్లో 26 నాటౌట్, 1 ఫోర్) క్రీజులో ఉండగా కావడం విశేషం. రక్షణాత్మక ధోరణిలో ఆడిన టీమిండియా గెలిచినా  ఈ మ్యాచ్‌లో  హీరోలు ఇరు జట్ల స్పిన్నర్లే.. 

భారత్.. అదే కథ.. 

లక్ష్య ఛేనదలో టీమిండియాకు ఆశించిన  ఆరంభమేమీ దక్కలేదు.  గత రెండు వన్డే సిరీస్ లలో దుమ్ము దులిపిన శుభ్‌మన్ గిల్ (11).. తాను  టీ20లకు పనికిరాడని మరోసారి తేల్చేశాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్ లో  అనవసర షాట్ కు యత్నించి   బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. తొలి పవర్ ప్లేలో భారత్ స్కోరు వికెట్ నష్టానికి  29 పరుగులే. 

గిల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 13, 1 ఫోర్) ఇష్ సోధి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు.  కానీ తర్వాత ఓవర్ లో ఇషాన్ కిషన్  (32 బంతుల్లో 19, 2 ఫోర్లు) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. పది ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.  

డ్రింక్స్ తర్వాత  ఇష్ సోధి వేసిన 11వ ఓవర్  నాలుగో బంతికి  రాహుల్ త్రిపాఠి.. భారీ షాట్ ఆడబోయి  గ్లెన్ ఫిలిప్స్  కు క్యాచ్ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన  వాషింగ్టన్ సుందర్  (10) సూర్యతో సమన్వయం కోల్పోయి  రనౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో  12 పరుగులు అవసరం కాగా.. ఫెర్గూసన్ వేసిన  19వ ఓవర్లో   ఐదు పరుగులొచ్చాయి. ఇక చివరి ఓవర్లో భారత్ విజయానికి ఆరు పరుగులు అవసముండగా..  తొలి బంతికి హార్ధిక్ పాండ్యా  (20 బంతుల్లో 15, 1 ఫోర్) సింగిల్ తీశాడు. రెండో బంతి డాట్ బాల్. మూడో బంతికి సూర్య ఒక్క పరుగు తీశాడు. నాలుగో బంతికి అదే కథ.  ఐదో బంతికి సూర్య  బౌండరీ కొట్టి భారత్ కు విజయాన్ని ఖాయం చేశాడు.  

అంతకుముందు టాస్ గెలిచి  మొదట బ్యాటింగ్  చేసిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది.  నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది.  కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (19 నాటౌట్) టాప్ స్కోరర్. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్.. టీమిండియా స్పిన్నర్ల ముందు తేలిపోయింది. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, చాప్‌మన్, ఫిలిప్స్, మిచెల్, బ్రాస్‌వెల్ లు  విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ కు రెండు వికెట్లు దక్కగా హార్ధిక్ పాండ్యా,  వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్ లకు తలా ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినా  స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై ఇరు జట్ల స్పిన్నర్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. 

ఇవీ రికార్డులు : 

- ఈ మ్యాచ్ లో  భారత్ తరఫున 13 ఓవర్లు స్పిన్నర్లు వేశారు.  కివీస్ నుంచి  17 ఓవర్లు స్పిన్నర్లవే.  ఒక మ్యాచ్ లో  స్పిన్నర్లు ఇన్ని ఓవర్లు వేయడం ఇండియాలో ఇదే ప్రథమం. 
- కివీస్ ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాటర్ కూడా సిక్సర్ కొట్టలేదు. భారత్ ది అదే కథ. 
- న్యూజిలాండ్ కు టీ20లలో భారత్ పై ఇదే అత్యల్ప స్కోరు. 

Follow Us:
Download App:
  • android
  • ios