స్పిన్ ఉచ్చులో బందీ అయిన భారత్.. తొలి టీ20లో కివీస్‌దే విజయం..
INDvsNZ T20I Live: భారత్-న్యూజిలాండ్ మధ్య రాంచీలో ముగిసిన తొలి టీ20లో టీమిండియా తడబడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది. తొలుత బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన కివీస్.. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టి సిరీస్ లో తొలి విజయాన్ని అందుకుంది.

వన్డే సిరీస్ లో వైఫల్యంతో టీ20 సిరీస్ ను న్యూజిలాండ్ కసిగా ఆడింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రాంచీలో ముగిసిన తొలి టీ20ని ఓటమితో ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ లో రెచ్చిపోయిన న్యూజిలాండ్.. స్పిన్ కు అనుకూలించిన రాంచీ పిచ్ పై భారత్ ను అదే అస్త్రంతో దెబ్బతీసింది. భారత బ్యాటర్లలో కీలక ఆటగాళ్లంతా స్పిన్నర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్దే పరిమితమైంది. ఫలితంగా కివీస్.. 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 47, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 50, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లు పోరాడినా మిగతా వాళ్లు చేతులెత్తేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో కివీస్.. 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 ఈనెల 29న లక్నో వేదికగా జరుగనుంది.
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తాకింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో సాంట్నర్.. రెండో ఓవర్లోనే పార్ట్ టైమ్ స్పిన్నర్ మైఖేల్ బ్రాస్‌వెల్ కు బంతినిచ్చాడు. అతడు వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఇషాన్ కిషన్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (0).. జాకబ్ డఫ్ఫీ వేసిన 3వ ఓవర్ నాలుగో బంతికి వికెట్ కీపర్ డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సాంట్నర్ వేసిన నాలుగో ఓవర్ లో భారత్ కు మరో భారీ షాక్ తప్పలేదు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ (7).. నాలుగో ఓవర్లో తొలి బంతికే ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్.. 15 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
టాప్-3 బ్యాటర్లు విఫలం కావడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20 బంతుల్లో 21, 1 ఫోర్, 1 సిక్స్) లు డిఫెన్స్ లో పడ్డారు. పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన సాంట్నర్.. మెయిడిన్ కావడం విశేషం. అదీ సూర్య క్రీజులో ఉన్నప్పుడు మెయిడిన్ వచ్చిందంటే భారత్ ఎంత డిఫెన్స్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.స్కోరు మరీ తక్కువగా ఉండటంతో బ్రాస్‌వెల్ వేసిన 8వ ఓవర్లో హార్ధిక్ సిక్సర్ బాదాడు. దీంతో భారత్ స్కోరు 50కు చేరింది. ఇష్ సోధి వేసిన 9వ ఓవర్లో సూర్య.. రెండు స్పీప్ షాట్ల ద్వారా బంతిని బౌండరీకి చేర్చాడు. అదే ఊపులో సూర్య.. టిక్నర్ వేసిన పదో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. పది ఓవర్లకు భారత్ స్కోరు 74-3.
సూర్య, పాండ్యాల నిష్క్రమణ.. పతనం మొదలు..
సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ లో మరో కుదుపు. ఇష్ సోధి వేసిన 12వ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్ ఆడి సిక్సర్ బాదిన సూర్య.. తర్వాతి బంతికి అలాగే ఆడి బౌండరీ లైన్ వద్ద పిన్ అలెన్ కు చిక్కాడు. దీంతో 68 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బ్రాస్‌వెల్ వేసిన 13 ఓవర్ రెండో బంతికి హార్ధిక్ పాండ్యా.. అతడికే క్యాచ్ ఇచ్చాడు.
ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా (10) లు ఒకసారి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫెర్గూసన్ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతికి సుందర్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ వెనకాలకు వెళ్లింది. అక్కడే ఉన్న ఇష్ సోధి క్యాచ్ అందుకోవడంలో విఫలయ్యాడు. తర్వాత దీపక్ హుడా కూడా బ్రాస్‌వెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడితే లాంగాఫ్ వద్ద ఉన్న చాప్‌మన్ దానిని డ్రాప్ చేశాడు. కానీ సాంట్నర్ వేసిన 16వ ఓవర్లో హుడా.. ముందుకొచ్చి ఆడాడు. బాల్ మిస్ కావడంతో కాన్వే స్టంపౌట్ చేశాడు.
హుడా ఔటయ్యాక వచ్చిన శివమ్ మావి (2) రనౌట్ కాగా కుల్దీప్ యాదవ్ (0) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆఖర్లో సుందర్ కొన్ని మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప భారత్ కు విజయాన్ని అందించలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (59), డెవాన్ కాన్వే (51), ఫిన్ అలెన్ (35) లు రాణించారు.