తడబడుతున్న టీమిండియా.. 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి..
INDvsNZ T20I Live: ఇండియా-న్యూజిలాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడుతోంది. 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

రాంచీ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ తడబడుతోంది. తొలుత కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువ భారత్ తడబడుతోంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (4), వన్డేలలో దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) లు దారుణంగా విఫలమయ్యారు. 15 పరుగులకే భారత్.. 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తాకింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో సాంట్నర్.. రెండో ఓవర్లోనే పార్ట్ టైమ్ స్పిన్నర్ మైఖేల్ బ్రాస్‌వెల్ కు బంతినిచ్చాడు. అతడు వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఇషాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి.. జాకబ్ డఫ్ఫీ వేసిన 3వ ఓవర్ నాలుగో బంతికి వికెట్ కీపర్ డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక సాంట్నర్ వేసిన నాలుగో ఓవర్ లో భారత్ కు మరో భారీ షాక్ తప్పలేదు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో బీభత్సమైన ఫామ్ లో ఉన్న గిల్.. తొలి బంతికే ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్.. 15 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
టాప్-3 బ్యాటర్లు విఫలం కావడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (15 బ్యాటింగ్), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (6 బ్యాటింగ్) లు డిఫెన్స్ లో పడ్డారు. వికెట్లు నిలిస్తే ఈ స్కోరును ఛేదించడం కష్టమేమీ కాదు. మంచు కారణంగా బంతి బాగా టర్న్ అవుతోంది. మరి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఈ ఇద్దరూ మరో ఏడెనిమిది ఓవర్లు క్రీజులో ఉంటేగానీ భారత్ లక్ష్యం దిశగా సాగదు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.