కివీస్‌ను కట్టడి చేసిన స్పిన్నర్లు.. భారత్ ముందు ఈజీ టార్గెట్.. బ్యాటర్లు ఏం చేస్తారో..?
INDvsNZ 2nd T20I: ఇండియా - న్యూజిలాండ్ నడుమ లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత స్పిన్నర్లు రెచ్చిపోయారు. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టగా కివీస్ బ్యాటర్లు తేలిపోయారు.

భారత్ తో తొలి టీ20లో కివీస్ చేతిలో స్పిన్ దెబ్బకు విలవిల్లాడి మ్యాచ్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు అదే స్పిన్ తో ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది. స్పిన్ కు అనుకూలిస్తున్న లక్నో పిచ్ పై న్యూజిలాండ్‌ను కట్టడి చేసింది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ లు సమిష్టిగా రాణించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ ధాటిగానే ఇన్నింగ్స్ ను ఆరంభించింది. ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ (11) రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించాడు. కానీ యుజ్వేంద్ర చాహల్ వేసిన కివీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
స్పిన్నర్ల షో...
తర్వాతి ఓవర్లో వాషింగ్టన్ సుందర్.. డెవాన్ కాన్వే (11) ను ఔట్ చేశాడు. దీపక్ హుడా వేసిన ఏడో ఓవర్ లో గ్లెన్ ఫిలిప్స్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ (8) ను కుల్దీప్ యాదవ్.. పదో ఓవర్ చివరి బంతికి బౌల్డ్ చేశాడు. పది ఓవర్లకు కివీస్ స్కోరు 48-4.
వన్ డౌన్ లో వచ్చిన మార్క్ చాప్‌మన్ (21 బంతుల్లో 14) హుడా బౌలింగ్ లో రివర్స్ స్పీప్ షాట్ ఆడాడు. బంతి కుల్దీప్ ముందు పడింది. అయితే క్యాచ్ మిస్ అయినా క్షణాల్లో స్పందించిన కుల్దీప్.. వికెట్ కీపర్ కు బంతిని విసిరాడు. అప్పటికే క్రీజును వదిలిన చాప్‌మన్ ను ఇషాన్ రనౌట్ చేశాడు. తర్వాత కూడా స్కోరు వేగం పెరగలేదు. 15 ఓవర్లు ముగిసేసరికి కివీస్ చేసింది ఐదు వికెట్ల నష్టానికి 71 పరుగులు మాత్రమే.
చివరి ఐదు ఓవర్లలో..
కుల్దీప్ వేసిన 16వ ఓవర్లో ఐదు పరుగులొచ్చాయి. హార్ధిక్ పాండ్యా వేసిన 17వ ఓవర్లో బ్రాస్‌వెల్ (22 బంతుల్లో 14) ను అర్ష్‌దీప్ సింగ్ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్.. నాలుగో బంతికి ఇష్ సోధి (1), ఆరో బంతికి ఫెర్గూసన్ (0) ను ఔట్ చేశాడు. శివమ్ మావి వేసిన 19వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్.. ఐదు పరుగులే ఇచ్చాడు.
భారత బౌలర్లలో ఒక్క శివమ్ మావికి తప్ప మిగిలిన బౌలర్లందరికీ వికెట్లు దక్కాయి. అర్ష్‌దీప్ కు రెండు వికెట్లు దక్కగా హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహల్ లకు తలా ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు ఏకంగా 13 ఓవర్లు విసరడం గమనార్హం. 2016 మార్చి నుంచి స్పిన్నర్లు (భారత్) ఇన్ని ఓవర్లు విసరడం ఇదే ప్రథమం.