Asianet News TeluguAsianet News Telugu

శుభమన్ అదిరెన్.. డబుల్ సెంచరీతో రఫ్ఫాడించిన గిల్.. ఉప్పల్ వన్డేలో భారత్ భారీ స్కోరు

INDvsNZ Live: స్వదేశంలో  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో  భారత్  తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో  కదం తొక్కాడు. 

INDvsNZ Live: Shubman Gill Smashes Double Ton, India Sets 350 Target For New Zealand MSV
Author
First Published Jan 18, 2023, 5:24 PM IST


ఇటీవలే శ్రీలంకతో  వన్డే సిరీస్ ను 3-0తో నెగ్గిన  టీమిండియా.. బ్యాటింగ్ లో న్యూజిలాండ్‌తోనూ  అదే జోరు చూపించింది.   హైదరాబాద్  లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్దేలో  యువ ఓపెనర్  శుభమన్ గిల్ (49 బంతుల్లో 208, 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.  ఆది నుంచి దూకుడుగా ఆడుకుంటూ వచ్చిన శుభమన్..  సెంచరీ తర్వాత   ఆకాశమే హద్దుగా  రెచ్చిపోయి ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (38 బంతుల్లో 34, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్  (26 బంతుల్లో 31, 4 ఫోర్లు), హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 28, 3 ఫోర్లు) అండగా నిలిచారు. గిల్ రెచ్చిపోయి ఆడటంతో  నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  భారత్‌కు శుభారంభమే దక్కింది.  ఓపెనర్లు  రోహిత్ శర్మ (38 బంతుల్లో 34,  4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభమన్ గిల్   నింపాదిగా ఆడారు.  తొలి ఓవర్ ఆఖరు బంతికి బౌండరీ బాదిన రోహిత్.. షిప్లే వేసిన మూడో ఓవర్లో  బౌండరీతో పాటు  చివరి బాల్‌కు సిక్సర్ కొట్టాడు. 

టిక్నర్ వేసిన  భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గిల్ రెండు వరుస ఫోర్లు కొట్టాడు. దీంతో భారత్ స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి భారత్.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. టిక్నర్ వేసిన  11వ ఓవర్లో  మూడో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్.. అతడే వేసిన 13వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడి మిడాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న  డారిల్ మిచెల్ కు చిక్కాడు. కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ (8)ని సాంట్నర్ పెవిలియన్ పంపాడు. ఇషాన్ కిషన్  (5) నిరాశపరిచాడు. 

శుభమన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..  

రోహిత్, కోహ్లీ, ఇషాన్ లు ఔటైనా గిల్ జోరు ఆపలేదు.  సాంట్నర్ వేసిన  14వ ఓవర్లో  రెండు  బౌండరీలు బాదాడు. షిప్లే బౌలింగ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.  బ్రాస్‌వెల్ వేసిన  ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి  భారీ సిక్సర్ బాదిన  గిల్ హాఫ్ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు.  ఇషాన్ స్థానంలో వచ్చిన సూర్య కూడా నాలుగు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించాడు. గిల్ తో కలిసి  అతడు ఐదో వికెట్ కు 65 పరుగులు జోడించాడు.   తర్వాత సూర్యను డారెల్ మిచెల్  ఔట్ చేశాడు.   

మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్లో  బౌండరీ బాది  90లలోకి చేరిన గిల్.. అతడే వేసిన  30వ ఓవర్లో భారీ సిక్సర్ బాది 99కు చేరాడు.   తర్వాత బంతికి   లాంగాన్ దిశగా సింగిల్ తీసి   సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.  87 బంతుల్లోనే అతడి శతకం  పూర్తయింది.   సూర్య  స్థానంలో వచ్చిన హార్ధిక్ పాండ్యా తో కలిసి గిల్..  74 పరుగులు జోడించాడు.  అయితే హార్ధిక్..   మిచెల్ వేసిన ఓ బంతి వికెట్లకు తాకడంతో  నిష్క్రమించాడు.  బంతి వికెట్లు తాకలేదని టీవీ రిప్లేలో స్పష్టంగా కనిపించినా   థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించడం గమనార్హం. 

చివర్లో.. 

సెంచరీ తర్వాత  పాండ్యాతో పాటు నిలకడగా ఆడిన గిల్ కాస్త నెమ్మదించాడు.  పాండ్యా నిష్క్రమించాక మళ్లీ  బ్యాట్ కు పనిచెప్పాడు.   ఈ క్రమంలోనే  బ్రాస్‌వెల్ బౌలింగ్ లో  భారీ సిక్సర్ బాది 150 పరుగులు (122 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.   కానీ మరో ఎండ్ లో  వాషింగ్టన్ సుందర్  (12)  45వ ఓవర్ వేసిన షిప్లే బౌలింగ్ లో ఎల్బీడబ్ట్యూగా నిష్క్రమించాడు. వన్డేలలో షిప్లేకు ఇదే తొలి వికెట్.  ఆ తర్వాత కూడా శార్దూల్ ఠాకూర్ (3) గిల్ తో సమన్వయ లోపం కారణంగా  రనౌట్ అయ్యాడు.  

 

డబుల్ సెంచరీ దిశగా.. 

 

150 పూర్తయ్యాక  గిల్ రెచ్చిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న క్రమంలో  తనే బ్యాటింగ్ స్ట్రైక్ తీసుకున్నాడు. టిక్నర్ వేసిన  48వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు  బాదాడు. దీంతో అతడు 180లకు చేరింది.  ఆ తర్వాత  ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్లో  హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి డబుల్  సెంచరీ (145 బంతుల్లో)  సాధించాడు.  వన్డేలలో భారత్ కు ఇది ఏడో డబుల్ సెంచరీ కావడం విశేషం. చివరి ఓవర్లో  గిల్ భారీ షాట్ ఆడబోయి గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios