బౌలర్లు భళా.. కివీస్ విల విల.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్
INDvsNZ:టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కివీస్.. 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బౌలింగ్ వేసిన ప్రతీ బౌలర్ కు వికెట్ దక్కడం గమనార్హం.

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ లో స్వల్ప తేడాతో ఓడి రెండో వన్డేలో పుంజుకుందామనుకున్న కివీస్ ఆశలను భారత బౌలర్లు అడియాసలు చేశారు. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కివీస్.. 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బౌలింగ్ వేసిన ప్రతీ బౌలర్ కు వికెట్ దక్కడం గమనార్హం. తొలుత షమీ, సిరాజ్ టాపార్డర్ వెన్నువిరవగా తర్వాత హార్ధిక్, శార్దూల్ మిడిలార్డర్ పని పట్టారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు లోయరార్డర్ ను ఆడుకున్నారు.
రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. తొలి ఓవర్లో ఐదో బంతికే ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ (0) ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన షమీ ఓవర్ లో పరుగులేమీ రాలేదు.
పరుగుల ఖాతా తెరవకున్నా వికెట్ల ఖాతా తెరిచిన న్యూజిలాండ్.. ఐదు ఓవర్లకు చేసింది 8 పరుగులే. ఆరో ఓవర్ వేసిన సిరాజ్.. నికోలస్ (20 బంతుల్లో 2) ను అద్భుతమైన లెంగ్త్ బాల్ తో బోల్తా కొట్టించాడు. నికోలస్.. ఫస్ట్ స్లిప్ లో శుభ్‌మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.షమీ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి డారిల్ మిచెల్ (1) అతడికే క్యాచ్ ఇచ్చాడు. ఏడు ఓవర్లకు కివీస్ 3 వికెట్లు కోల్పోయి పది పరుగులే చేసింది. పదో ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. నాలుగో బంతికి ఓపెనర్ డెవాన్ కాన్వే (16 బంతుల్లో 7, 1 ఫోర్) ను ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని హార్ధిక్ పక్కకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
11వ ఓవర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో కెప్టెన్ టామ్ లాథమ్ (17 బంతుల్లో 1) ఫస్ట్ స్లిప్స్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా కివీస్.. 11 ఓవర్లలో 15 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ ఇన్నింగ్స్ ను గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36, 5 ఫోర్లు) మైకేల్ బ్రేస్‌వెల్ (30 బంతుల్లో 22, 4 ఫోర్లు) ఆదుకునే యత్నం చేశారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు. నాలుగు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన బ్రేస్‌వెల్ మరో భారీ ఇన్నింగ్స్ కనిపించాడు. కానీ షమీ అతడి ఆట సాగనివ్వలేదు. షమీ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి బ్రేస్‌వెల్.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
అతడి స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ (39 బంతుల్లో 27, 3 ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. సాంట్నర్ తో కూడా 44 పరుగులు జోడించిన ఫిలిప్స్ పై కివీస్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ హార్ధిక్ పాండ్యా వేసిన 30వ ఓవర్ తొలి బంతికి సాంట్నర్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్న నేపథ్యంలో సహనం కోల్పోయిన ఫిలిప్స్.. వాషింగ్టన్ సుందర్ వేసిన 31 వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడి సూర్యకుమార్ యాదవ్ కు చిక్కాడు. ఫెర్గూసన్ (1) ను కూడా అలాగే పెవిలియన్ కు పంపాడు సుందర్. చివరి వికెట్ గా వచ్చిన టిక్నర్ (2) ను కుల్దీప్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి కివీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.
భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కు తలా రెండు వికెట్లు పడ్డాయి. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసి కివీస్ నడ్డి విరిచారు.