Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ హాఫ్ సెంచరీ.. కివీస్‌పై బదులు తీర్చుకున్న భారత్.. సిరీస్ కైవసం..

INDvsNZ: స్వదేశంలో ఇటీవలే శ్రీలంకపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్ ను  తన ఖాతాలో వేసుకుంది.  న్యూజిలాండ్ పై మరో మ్యాచ్ మిగిలుండగానే  2-0 తేడాతో సిరీస్ నెగ్గింది. తొలుత భారత బౌలర్లు  కివీస్ ను ఆటాడుకోగా తర్వాత బ్యాటర్లు  అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు. 

INDvsNZ Live: India  Beat New Zealand by 8 wickets, Clinch The Series With 2-0
Author
First Published Jan 21, 2023, 6:26 PM IST

సొంతగడ్డపై  టీమిండియా మరోసారి అదరగొట్టింది. తొలుత బంతితో  తర్వాత బ్యాట్ తో  కివీస్ ను ఆటాడుకుంది.  మూడు మ్యాచ్ లలో భాగంగా మరో వన్డే మిగిలుండగానే  సిరీస్ ను 2-0 తేడాతో  కైవసం చేసుకుంది. ఫలితంగా కివీస్ పై గతేడాది వన్డేలలో ఎదురైన సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో సెమీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. అక్కడ  టీ20 సిరీస్ నెగ్గినా వన్డే సిరీస్ కోల్పోయింది. నేటి మ్యాచ్ లో కివీస్.. 34.3 ఓవర్లలో  108 పరుగులకే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.   టీమిండియా సారథి  రోహిత్ శర్మ  (50 బంతుల్లో 51, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)  రాణించగా, శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్, 6 ఫోర్లు) తన ఫామ్ ను కొనసాగించాడు. 

స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.   ఎలాంటి సంచనాలకు తోడివ్వకుండా  తొలుత ఆచితూచి ఆడిన  రోహిత్ శర్మ  రెచ్చిపోయాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లు  స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.   షిప్లే వేసిన రెండో ఓవర్లో ఫోర్ తో  ఖాతా తెరిచిన  హిట్‌మ్యాన్..  ఫెర్గూసన్ వేసిన  ఐదో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు.  ఈ మ్యాచ్ లో ఇదే తొలి సిక్సర్ కావడం విశేషం.  

అయితే పిచ్ కాస్త  బౌలర్లకు సహకారం అందిస్తున్న నేపథ్యంలో   ఓపెనర్లిద్దరూ ఆచితూచి ఆడారు.  దీంతో 9 ఓవర్లకు భారత్ స్కోరు  41 పరుగులే. కానీ  పదో ఓవర్లో రోహిత్.. టిక్నర్ బౌలింగ్ లో  ఫోర్, సిక్సర్ బాది  స్కోరుబోర్డును 50 పరుగులు దాటించాడు.  ఆ తర్వాత శాంట్నర్ బౌలింగ్ లో  రోహిత్, గిల్ లు తలో ఫోర్ కొట్టారు.  

గిల్ నెమ్మదిగా ఆడినా  రోహిత్ మాత్రం అడపాదడపా బౌండరీలు కొట్టాడు.  శాంట్నర్  వేసి 13వ ఓవర్లో  తొలి బంతికి ఫోర్ కొట్టిన  రోహిత్.. నాలుగో బంతికి  సింగిల్ తీసి  హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో  ఓపెనర్లే మ్యాచ్ ను పూర్తిచేస్తారని ఆశించారంతా. కానీ   షిప్లే వేసిన  15వ ఓవర్ రెండో బంతికి   రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (11).. మ్యాచ్ ను త్వరగా ముగించే క్రమంలో కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షిప్లే వేసిన 17వ ఓవర్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదాడు. కానీ సాంట్నర్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయి వెనుదిరిగాడు.  నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ (8)..  శుభ్‌మన్ తో కలిసి  భారత్ విజయాన్ని పూర్తి చేశాడు.

స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ నెగ్గిన భారత్ కు ఈ ఏడాది ఇది వరుసగా మూడో (వన్డేలలో రెండోది) సిరీస్ విజయం కావడం గమనార్హం.  ఇక ఈ సిరీస్ లో మూడో వన్డే.. ఈనెల 24న ఇండోర్ లో జరుగుతుంది.  

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్. ఫిలిప్స్ తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కు తలా రెండు వికెట్లు పడ్డాయి.  సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసి కివీస్ నడ్డి విరిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios