Asianet News TeluguAsianet News Telugu

హిట్ మ్యాన్‌ను హత్తుకున్న కుర్రాడు.. కిందపడబోయినా వదల్లేదు.. వీడియో వైరల్

INDvsNZ ODI:భారత్-న్యూజిలాండ్ మధ్య  రాయ్‌పూర్ వేదికగా   ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రాణించిన  టీమిండియా.. సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

INDvsNZ : A Fan  Invaded into Ground, Hugs Rohit Sharma During The Match, Watch Viral Video MSV
Author
First Published Jan 21, 2023, 9:42 PM IST

భారత్ లో క్రికెట్  అంటేనే ఓ అనధికారిక మతం వంటిది. ఇక్కడ క్రికెటర్లకు అభిమానుల కంటే భక్తులే ఉంటారు. నాటి గవాస్కర్ నుంచి మొదలుకుని  కపిల్ దేవ్,  క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ధోనిలకు  బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఆధునిక క్రికెట్ లో  ఇంత అభిమానగణం సాధించుకున్న వారిలో టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు ముందువరుసలో ఉంటారు. బయట తమ అభిమాన ఆటగాళ్లను చూడటం, ఫోటోలు దిగడం ఓ ఎత్తైతే  మ్యాచ్ జరుగుతుండగా వారిని కలవడానికి  చాలా మంది అభిమానులు రిస్క్ చేసి మరీ వాళ్లను కలుస్తుంటారు. తాజాగా   రాయ్‌పూర్ తో వన్డేలో  ఓ  కుర్రాడు.. హిట్‌మ్యాన్ ను కలవడానికి వచ్చి అతడిని గట్టిగా హత్తుకున్నాడు. 

భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగిందీ ఘటన.   ఇండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతి వేసిన తర్వాత స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ కుర్రాడు.. అమాంతం  పరిగెత్తుకుని వచ్చి   నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న హిట్‌మ్యాన్ ను హత్తుకున్నాడు. 

ఆ క్రమంలో  బ్యాలెన్స్ తప్పిన రోహిత్ కిందపడిపోయాడు.  కానీ బ్యాట్ సాయంతో   దానిని నివారించాడు. అయితే ఆ కుర్రాడితో పాటే పరుగెత్తుకొచ్చిన  గ్రౌండ్ సిబ్బంది  అతడిని  పట్టుకుని లాక్కెళ్తుండగా రోహిత్ వారిని వారించాడు. ‘చిన్న పిల్లాడు. ఏమనకండి. వదిలేయండి..’ అని వారికి సూచించాడు. దీంతో వాళ్లు ఆ కుర్రాడిని అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఇటీవల  తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో  ఓ అభిమాని  పరుగెత్తుకుని వచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకబోయాడు. సదరు అభిమాని.. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని  కోహ్లీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు.  కోహ్లీని అభిమానించే ఆ ఫ్యాన్..  అతడి కాళ్లను మొక్కేందుకు యత్నించాడు.  అది చూసిన  కోహ్లీ.. అతడిని పైకి లేపబోయాడు. అభిమానిని పైకి లేపి  భుజం తట్టి అక్కడ్నుంచి పంపించాడు.  

 

ఇక రాయ్‌పూర్ లో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్  34.3 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది.  గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్. ఫిలిప్స్ తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కు తలా రెండు వికెట్లు పడ్డాయి.  సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసి కివీస్ నడ్డి విరిచారు. తర్వాత భారత్.. 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.  రోహిత్ శర్మ (51), శుభ్‌మన్ గిల్  (40) లు రాణించారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఈనెల 24న ఇండోర్ లో జరుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios