గిల్ జిగేల్.. టీ20లలో మొదటి సెంచరీ.. మోడీ స్టేడియంలో కివీస్ బౌలర్లకు మోత మోగించిన టీమిండియా..
INDvsNZ 3rd T20I Live: సిరీస్ గెలవాలంటే తప్పక ఆడాల్సిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. టీ20లకు పనికిరాడన్న శుభ్‌మన్ గిల్.. మెరుపు సెంచరీతో అహ్మదాబాద్ లో భారత్ భారీ స్కోరు సాధించింది.

న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా రెచ్చిపోయింది. టీ20లకు పనికిరాడు అని విమర్శలు ఎదుర్కుంటున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తాను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచీ దూకుడుగా ఆడిన గిల్.. హాఫ్ సెంచరీ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. గ్రౌండ్ నలువైపులా వీరబాదుడు బాదాడు. గిల్‌కు తోడుగా రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44, 4 సిక్సర్లు, 3 బౌండరీలు), హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) లు అతడికి సహకారం అందించారు. గిల్ సెంచరీతో అహ్మదాబాద్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత బౌలర్లు ఏం చేస్తారో మరి..?
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. పేలవ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. కానీ వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి మాత్రం రెచ్చిపోయాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో కలిసి ఇద్దరూ కివీస్ బౌలర్లను ఉతికారేశారు.
ఫెర్గూసన్ వేసిన భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో త్రిపాఠి, గిల్ లు చెరో బౌండరీ బాదారు. టిక్నర్ వేసిన ఐదో ఓవర్లో గిల్.. మూడు ఫోర్లు కొట్టాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో త్రిపాఠి 4,6 బాదాడు. తొలి పవర్ ప్లేలో భారత్ ఒక వికెట్ నష్టోపోయి 58 పరుగులు చేసింది.
శాంట్నర్ బౌలింగ్ లో త్రిపాఠి ఫోర్, సిక్స్ బాదాడు. అదే ఊపులో ఇష్ సోధి బౌలింగ్ లో కూడా తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. కానీ తర్వాత బంతికే అతడు.. భారీ షాట్ ఆడబోయి ఫెర్గూసన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. త్రిపాఠి స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ( 13 బంతుల్లో 24, 1 ఫోర్, 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు కొట్టి జోరు మీద కనిపించాడు. పది ఓవర్లలోనే భారత స్కోరు వంద (108-2) పరుగులు దాటింది.
గిల్ దూకుడు..
శాంట్నర్ వేసిన 12వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసిన గిల్.. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లలో గిల్ కు ఇదే తొలి అర్థ సెంచరీ. ఇక టిక్నర్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి సూర్య.. బ్రాస్‌వెల్ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. సూర్య ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ధాటిగానే ఆడాడు. తాను ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీ బాదిన అతడు.. ఫెర్గూసన్, శాంట్నర్ ల బౌలింగ్ లో కూడా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. 15 ఓవర్లకు భారత్ 150 పరుగుల మార్క్ దాటింది.
35 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్.. తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బెన్ లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన అతడు.. 80లలోకి వచ్చాడు. ఇక టిక్నర్ వేసిన 17వ ఓవర్లో.. 6, 4, 4 బాది 90లలోకి చేరాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాది 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఫిఫ్టీకి 36 బంతులు తీసుకున్న గిల్.. తర్వాత యాభై పరుగులను కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమనార్హం.
చివర్లో గిల్ మరింత రెచ్చిపోయాడు. బెన్ లిస్టర్ వేసిన 19వ ఓవర్లో గిల్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఆఖరి ఓవర్లో హార్ధిక్ భారీ షాట్ ఆడి నిష్క్రమించాడు. కివీస్ పై టీ20లలో భారత్ కు ఇదే అత్యధిక స్కోరు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, టిక్నర్, ఇష్ సోధి, మిచెల్ లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.