గెలిచినోళ్లకు సిరీస్.. కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా..
INDvsNZ T20I: స్వదేశంలో గత పదేండ్ల కాలంలో న్యూజిలాండ్ చేతిలో ఇంతవరకూ ఏ ఫార్మాట్ లోనూ సిరీస్ కోల్పోని టీమిండియా తాజాగా కీలక మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మూడో టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ నేడు టీమిండియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ అయినా టీ20లో మాత్రం గట్టి పోటీనిస్తున్న ఆ జట్టు.. పొట్టి సిరీస్ నెగ్గడం మీద కన్నేసింది. ఇదివరకే రెండు మ్యాచ్ లు ముగిసిన ఈ సిరీస్ లో రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక నేటి మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లదే సిరీస్. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20కి కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు రానుంది. కివీస్ బౌలింగ్ చేయనుంది.
స్వదేశంలో 2012లో ముగిసిన ఏకైన టీ20 మినహా ఏ ఫార్మాట్ లో కూడా భారత జట్టు స్వదేశంలో కివీస్ కు సిరీస్ కోల్పోలేదు. మరి నేటి మ్యాచ్ లో టీమిండియా ఆ రికార్డును కాపాడుకుంటుందా..? లేక వదిలేస్తుందా..? అన్నది ఆశ్చర్యకరంగా మారింది.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చాడు. కివీస్ తరఫున డఫ్ఫీ స్థానంలో బెన్ లిస్టర్ వచ్చాడు.
వన్డే సిరీస్ లో ఓడినా టీ20లలో మాత్రం ఇప్పటిదాకా కివీస్ దే పైచేయిగా ఉంది. భారత బౌలర్లు.. కివీస్ ను బౌలింగ్ లో కట్టడి చేస్తున్నా బ్యాటింగ్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నది. తొలి మ్యాచ్ తో పాటు లక్నో వేదికగా ముగిసిన రెండో టీ20లో కూడా భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. లక్నోలో వంద పరుగులు చేయడానికి టీమిండియా నానా తంటాలు పడింది. మరి నేటి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం.
తుది జట్లు :
భారత్ : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోధి, బెన్ లిస్టర్, లాకీ ఫెర్గూసన్ ,బ్లయర్ టిక్నర్