Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd T20I: రోహిత్, రాహుల్ నాటు కొట్టుడు... టీమిండియాదే టీ20 సిరీస్...

India vs New Zealand: 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా... వరుస సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించిన రిషబ్ పంత్...

INDvsNZ 2nd T20I: Rohit Sharma, KL Rahul superb knocks, Team India beats New Zealand and Won T20 Series
Author
India, First Published Nov 19, 2021, 10:51 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైనా, ద్వైపాక్షిక సిరీసుల్లో అదిరిపోయే రికార్డు ఉన్న టీమిండియా... న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాంఛీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించిన భారత జట్టు, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది...

మొదటి బంతికే బౌండరీ బాది ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కెఎల్ రాహుల్, రెండు ఓవర్ల పాటు రోహిత్ శర్మకు ఒక్క బాల్ కూడా స్ట్రైయిక్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 100+ పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి. అత్యధికసార్లు టీ20ల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశారు రోహిత్, కెఎల్ రాహుల్... ఈ ఏడాదిలో ఈ ఇద్దరి మధ్య ఇది వరుసగా ఐదో 50+ భాగస్వామ్యం.

రోహిత్ శర్మకు టీ20ల్లో ఇది 13వ 100+ భాగస్వామ్యం. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు రోహిత్ వర్మ...

తొలి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. టీ20 కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కెఎల్ రాహుల్, 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, కెరీర్‌లో 29వ టీ20 అర్ధశతకాన్ని అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ..

36 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టిమ్ సౌథీ బౌలింగ్‌లో గప్టిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ అవుట్ అవ్వడం టీ20ల్లో నాలుగోసారి కాగా ఓవరాల్‌గా 11వసారి. రోహిత్ అవుటయ్యే సమయానికి 27 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది భారత జట్టు...

మొదటి బంతికి సింగిల్ తీసిన సూర్యకుమార్ యాదవ్, రెండో బంతికి టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు రిషబ్ పంత్. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, డార్ల్ మిచెల్ కలిసి మొదటి వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం అందించారు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఈ దశలో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీని అధిగమించి, టాప్‌లోకి దూసుకెళ్లాడు గప్టిల్. విరాట్ కోహ్లీ 91 టీ20 మ్యాచుల్లో 29 హాఫ్ సెంచరీలతో 3216 పరుగులు చేయగా మార్టిన్ గప్టిల్, 111 టీ20 మ్యాచుల్లో 3248 పరుగులు చేసి టాప్‌ ప్లేస్‌ని అధిరోహించాడు.

ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్ ఛాప్‌మన్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  డార్ల్ మిచెల్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌, అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన గ్లెన్ ఫిలిప్స్, ఆ తర్వాత భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...

21 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 


12 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన జేమ్స్ నీషమ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios