Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd ODI: టాస్ గెలిచిన టీమిండియా... రాయిపూర్‌లో మొట్టమొదటి వన్డే..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... మొదటి వన్డే జట్టులో మార్పులు లేకుండా బరిలో భారత జట్టు.. 

INDvsNZ 2nd ODI: Team India Captain Rohit sharma won the toss elected to field first CRA
Author
First Published Jan 21, 2023, 1:08 PM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో ఎదురైన అనుభవాలకు తోడు కొత్త స్టేడియంతో జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడంతో లక్ష్యఛేదనకే మొగ్గు చూపాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 349 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించగలిగింది భారత జట్టు. గెలిచింది టీమిండియానే అయినా 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు నైతిక విజయం సాధించింది...

ముఖ్యంగా మైకేల్ బ్రాస్‌వెల్ 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత జట్టులో యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా 40+ స్కోరు కూడా చేయలేకపోయారు...

రాయిపూర్‌లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే. 2021 సీజన్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కి వేదిక నిచ్చిన షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, భారత్‌లో వన్డేలకు వేదిక నిస్తున్న 50వ స్టేడియంగా నిలిచింది...

కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటు నుంచి సెంచరీ రాక ఏడాదిన్నర దాటిపోయింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 52 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ, సెంచరీ మార్కును మాత్రం అందుకోలేకపోతున్నాడు. మంచి ఆరంభం దక్కుతున్నా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఫెయిల్ అవుతున్న రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో మాత్రం ఆ మార్కును దాటుతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...

టీ20ల్లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కి దూరం కావడంతో వరుసగా అవకాశాలు దక్కించుకున్న సూర్య, వన్డేల్లో స్థిరమైన చోటు దక్కించుకోవాలంటే ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తీరాల్సిందే. సూర్యతో పాటు బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించగలనని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది...

తొలి వన్డేకి ముందు గాయపడిన ఇష్ సోదీ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్ జట్టు కూడా రెండో వన్డేలో మార్పులు లేకుండానే బరిలో దిగుతోంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో రాయిపూర్‌లో జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ గేమ్‌లుగా ముగిశాయి. దీంతో తొలి వన్డేలో ఎంత స్కోరు నమోదవుతాయో చూడాలి..

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, హెన్రీ నికోలస్, డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సిప్లీ, లూకీ ఫర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ 

భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ 

Follow Us:
Download App:
  • android
  • ios