Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st Test: పాతుకుపోయిన కివీస్ ఓపెనర్లు... భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్...

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో 129 పరుగులు చేసిన న్యూజిలాండ్... ఇంకా భారత జట్టు స్కోరుకి 216 పరుగుల దూరంలో..

INDvsNZ 1st Test: Team India bowlers failed to pick wickets, new zealand openers
Author
India, First Published Nov 26, 2021, 4:31 PM IST

కాన్పూర్‌ టెస్టులో టీమిండియాపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది న్యూజిలాండ్. తొలి రోజు రెండు సెషన్ల పాటు భారత జట్టు ఆధిక్యం కనబర్చగా... రెండో రోజు పూర్తిగా కివీస్ ఆధిక్యమే కొనసాగింది. న్యూజిలాండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయి, భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది న్యూజిలాండ్.

విల్ యంగ్ 180 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 165 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 57 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, ఐదేళ్ల తర్వాత భారత్‌లో 50+ ఓవర్లు బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఓపెనర్లుగా నిలిచారు. 

రవిచంద్రన్ అశ్విన్ 17, జడేజా 14, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ పదేసి ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయారు. మూడు సార్లు అంపైర్ అవుట్ ఇచ్చినా బతికిపోయిన టామ్ లాథమ్, క్రీజులో పాతుకుపోయాడు. ఎట్టకేలకు రెండో రోజు ఆట ముగుస్తుందనగా అశ్విన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌ను అవుట్‌గా అంపైర్ ప్రకటించినా, మరోసారి రివ్యూకి వెళ్లిన కివీస్ ఓపెనర్‌కి నాటౌట్‌గా ఫలితం వచ్చింది.

అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది.

112 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఓవర్‌నైట్ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జడ్డూ...

మరో ఎండ్‌లో కేల్ జెమ్మీసన్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ అందుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్, రెండో రోజు ఉదయం సెషన్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో మూడు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదడం విశేషం...  157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. 
 
ఈ శతాబ్దంలో తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు. 

ఓవరాల్‌గా ఆరంగ్రేట టెస్టులో సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2016 తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన నెం.5 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అయ్యర్. ఇంతకుముందు అజింకా రహానే రెండుసార్లు, కరణ్ నాయర్ (త్రిబుల్ సెంచరీ) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

కాన్పూర్ వేదికగా  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా... తొలి రోజు పూర్తి ఆధిక్యం కనబర్చింది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు.

ఐదో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా.  వృద్ధిమాన్ సాహా 12 బంతుల్లో 1 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అయ్యర్, విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అక్షర్ పటేల్ 9 బంతుల్లో 3 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా, రవిచంద్రన్ అశ్విన్ 56 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసి లంచ్ బ్రేక్ తర్వాత పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ 34 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేయగా అజాజ్ పటేల్ ఆఖరి రెండు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీకి ఐదు వికెట్లు దక్కగా, కేల్ జెమ్మీసన్ మూడు వికెట్లు తీశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios