Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st T20I: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ... ఆఖరి ఓవర్‌లో గెలిచిన టీమిండియా...

India vs New Zealand: హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్, 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ... ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు..

INDvsNZ 1st T20I:  SuryaKumar Yadav Scores half century, Team India wins in first T20I
Author
India, First Published Nov 17, 2021, 10:47 PM IST

జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఒకనొక దశలో సునాయాస విజయాన్ని అందుకునేలా కనిపించిన భారత జట్టు, అనవసరమైన డిఫెన్స్, ఒత్తిడి, వికెట్లు పడడంతో ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది..  రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా,  సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది రోహిత్, రాహుల్ జోడి. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఛాప్‌మన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రోహిత్ కలిసి రెండో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, 40 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. యాదవ్ అవుటయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 20 బంతుల్లో 21 పరుగులు కావాలి. 

అయితే 18వ ఓవర్‌లో 5 పరుగులు రాగా, 19వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ, ఆఖరి బంతికి శ్రేయాస్ అయ్యర్‌ని అవుట్ చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి బంతి వైడ్ బాల్‌గా వెళ్లగా ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు మొదటి మ్యాచ్ ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్. అయితే రెండో బంతికి డిఫరెంట్ షాట్‌కి ప్రయత్నించిన వెంకటేశ్ అయ్యర్, రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి మరో వైడ్ రాగా, అక్షర్ పటేల్ సింగిల్ తీయగా... రిషబ్ పంత్ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకి తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మూడో బంతికే డార్ల్ మిచెల్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన యార్కర్‌ను ఎదుర్కోవడంలో మిచెల్ విఫలం కావడంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుని మార్క్ ఛాప్‌మన్, మార్టిన్ గుప్టిల్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన మార్క్ ఛాప్‌మన్, ఆ తర్వాత వేగం పెంచి, బౌండరీలతో ఎదురుదాడి చేశాడు..

50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మార్క్ ఛాప్‌మన్‌ని రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఛాప్‌మన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, అదే ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ని పెవిలియన్ చేర్చాడు.

మూడు బంతులాడిన గ్లెన్ ఫిలిప్స్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర జారవిడిచాడు అక్షర్ పటేల్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన టిమ్ సిఫర్ట్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Follow Us:
Download App:
  • android
  • ios