ఉప్పల్లో ఇండియా-కివీస్ తొలి వన్డే.. టికెట్లన్నీ ఆన్లైన్లోనే.. రేపటి నుంచే అమ్మకాలు
INDvsNZ Tickets: ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ ఇది ముగిసిన వెంటనే కివీస్ తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి వన్డే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) లో జరుగుతుంది.

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో వన్డే సమరానికి సిద్ధమవుతుంది. తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నది. ఈ మ్యాచ్ కు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. మ్యాచ్ టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్ వేదికగా విక్రయించనున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 18న కివీస్ తో తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో మ్యాచ్ ను ఆటగాళ్లు, ప్రేక్షకులు, అథిథులు ఆస్వాదించేలా నిర్వహిస్తామని చెప్పాడు.
గతేడాది భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ సందర్భంలో హెచ్‌సీఏ వ్యవహరించిన తీరుపై విమర్శలు తలెత్తాయి. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు తీసుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టికెట్లను అజారుద్దీన్ తనకు కావాల్సినవారికి అందజేశాడని, ప్రేక్షకులకు మాత్రం బ్లాక్ లో రెట్టింపు రేట్లకు కూడా దొరకలేదని విమర్శలు వినిపించాయి.
గత వైఫల్యాల నేపథ్యంలో హెచ్‌సీఏ మేల్కొంది. ఈసారి టికెట్లను ఆన్‌లైన్ లో మాత్రమే అమ్ముతామని అజారుద్దీన్ తెలిపాడు. మ్యాచ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయన నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. ఇండియా-కివీస్ మ్యాచ్ కోసం 13 నుంచి 16 వరకు ఆన్‌లైన్ (పేటీఎం) లో టికెట్ల విక్రయం ఉంటుందని చెప్పాడు. రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి పేటీఎంలో టికెట్ల విక్రయం మొదలవుతుందని.. ఆన్‌లైన్ లో టికెట్లు కొన్న ప్రేక్షకులు.. 15వ తేదీ నుంచి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలలో ఏర్పాటు చేసే కౌంటర్ల వద్ద ఫిజికల్ టికెట్లను తీసుకోవాలని వివరించాడు.
ఆఫ్ లైన్ లో ఏ ఒక్క టికెట్ కూడా అమ్మడంలేదని ఈ సందర్భంగా అజారుద్దీన్ స్పష్టం చేశాడు. ‘దాదాపు నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ లో వన్డే మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. స్టేడియం మొత్తం సామర్థ్యం 39,112 కాగా.. 29,417 టికెట్లను ( మిగతా 9,695 టికెట్లు కాంప్లమెంటరీ పాసులు) అమ్మకానికి ఉంచుతున్నా’మని అజార్ తెలిపాడు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు టికెట్లను మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది.