Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st ODI: టాస్ గెలిచిన న్యూజిలాండ్... ఎట్టకేలకు సంజూ శాంసన్‌కి ఛాన్స్...

India vs New Zealand 1st ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... తుది జట్టులో రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌కి ఛాన్స్ ఇచ్చిన శిఖర్ ధావన్.. 

INDvsNZ 1st ODI: New Zealand won the toss and elected to bowl first, Sanju Samson in
Author
First Published Nov 25, 2022, 6:41 AM IST

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా, నేటి నుంచి వన్డే సిరీస్‌లో బరిలో దిగుతోంది. అక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై పడింది. ఈ టోర్నీకి జట్టును ఎంపిక చేసేందుకు ఈ సిరీస్ నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీమిండియా...

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా రెండో టీ20లో ఘన విజయం అందుకుంది టీమిండియా. మూడో టీ20 వర్షం కారణంగా టైగా ముగియడంతో భారత జట్టుని సిరీస్ వరించింది..

టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజూ శాంసన్, వన్డే సిరీస్‌లో అయినా తుది జట్టులో చోటు దక్కించుకోగలడా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే తొలి వన్డేలో రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా అవకాశం ఇచ్చాడు శిఖర్ ధావన్. 

శార్దూల్ ఠాకూర్‌తో పాటు యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్  ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నడిపించబోతున్నారు. వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్ స్పిన్నర్లుగా తుదిజట్టులోకి వచ్చారు. టీ20 సిరీస్‌కి ఎంపికైనా తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన శుబ్‌మన్ గిల్‌తో కలిసి కెప్టెన్ శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయబోతున్నాడు...

తుదిజట్టులో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉండడంతో బ్యాటింగ్ ఆర్డర్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా ఇండియాతో జరిగిన మూడో టీ20లో ఆడని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టీమిండియా 129 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. ఆతిథ్య జట్టు కూడా కావడంతో పాయింట్లతో సంబంధం లేకుండా వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది భారత జట్టు...

110 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకి ఈ వన్డే సిరీస్ కీలకంగా మారనుంది. ఈ సిరీస్‌లో గెలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతుంది న్యూజిలాండ్...

టీమిండియా తుది జట్టు ఇదే:  శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్ 

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్ (కెప్టెన్), టామ్ లాథమ్, డార్ల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్

Follow Us:
Download App:
  • android
  • ios