Asianet News TeluguAsianet News Telugu

INDvsENG 5th Test: రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే...

India vs England 5th Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... ఇంగ్లాండ్ ముందు 377 పరుగుల భారీ టార్గెట్...

 

INDvsENG 5th Test:  Team India all out in Second innings, puts Record target for England
Author
India, First Published Jul 4, 2022, 6:20 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఐదో టెస్టులో గెలవాలంటే ఇంగ్లాండ్ జట్టు 377 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇప్పటిదాకా ఏ జట్టూ కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో 300+ స్కోరు చేసింది లేదు. మ్యాచ్‌లో ఇంకా 150 ఓవర్లకు పైగా మిగిలే ఉండడంతో ఈ టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలన్నా ఇంగ్లాండ్‌ కష్టపడకతప్పదు..

ఓవర్‌నైట్ స్కోరు 125/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 81.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో 33వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఛతేశ్వర్ పూజారా 168 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అలెక్స్ లీస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...  

విదేశాల్లో 100కి పైగా బంతులను ఫేస్ చేయడం ఛతేశ్వర్ పూజారాకి ఇది 24వ సారి. రాహుల్ ద్రావిడ్ (38 సార్లు), సచిన్ టెండూల్కర్ (32 సార్లు), విరాట్ కోహ్లీ (25 సార్లు) మాత్రమే పూజారా కంటే ముందున్నారు... 2021 నుంచి ఛతేశ్వర్ పూజారాకి ఇది 8వ హాఫ్ సెంచరీ. 

టీమిండియా తరుపున గత రెండేళ్లలో అత్యధిక టెస్టు హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు ఛతేశ్వర్ పూజారా. రిషబ్ పంత్ 7 హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉండడం విశేషం...  SENA దేశాల్లో పూజారాకి ఇది 18వ హాఫ్ సెంచరీ.

పూజారా అవుటైన తర్వాత రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసి... విదేశాల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 
 

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, 26 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 190 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు... 

86 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసిన రిషబ్ పంత్, జాక్ లీచ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 26 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ షమీ 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

58 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన రవీంద్ర జడేజాని క్లీన్ బౌల్డ్ చేసిన బెన్ స్టోక్స్, 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాని అవుట్ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కి నాలుగు వికెట్లు దక్కగా  స్టువర్ట్ బ్రాడ్, మ్యాట్ పాట్స్ రెండేసి వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, జాక్‌ లీచ్‌లకు చెరో వికెట్ దక్కింది.  భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా ఇంగ్లాండ్ జట్టు 284 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios