టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసిన ఇంగ్లాండ్... టీమిండియా స్కోరుకి  205 పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు... ఆఖరి సెషన్‌లో భారత బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి మ్యాచ్ ఫలితం... 

లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది. 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్, టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే రోరీ బర్న్స్‌ను అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా... ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో డొమినిక్ సిబ్లీ కూడా డకౌట్ కావడంతో 1 పరుగుకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే హసీబ్ హమీద్‌తో కలిసి మూడో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఇంగ్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ జో రూట్. 

షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన హసీబ్ హమీద్, 45 బంతుల్లో 9 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో వికెట్‌కి జానీ బెయిర్‌స్టోతో కలిసి 23 పరుగులు జోడించాడు జో రూట్...

24 బంతుల్లో 2 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో, టీ బ్రేక్ ముందు ఇషాంత్ శర్మ వేసిన ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూ తీసుకున్న విరాట్ కోహ్లీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. టీమిండియా స్కోరుకి ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్.

మరోవైపు టీమిండియా మరో ఆరు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో జో రూట్ ఎప్పటిలాగే 57 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి... టీమిండియా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆఖరి సెషన్‌లో 38 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారనేదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.