వరల్డ్ క్లాస్ టాప్ బౌలింగ్ లైనప్ ఉన్న భారత జట్టు, ఇంగ్లాండ్ జట్టును ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతోంది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడిన ఇంగ్లాండ్ జట్టు, భారత పర్యటనలో స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటోంది. ఫలితంగా రెండో రోజు లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

జో రూట్ 277 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 156 పరుగులు చేయగా... బెన్ స్టోక్స్ 98 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. బెన్‌స్టోక్స్‌కి ఇది టెస్టుల్లో 23వ హాఫ్ సెంచరీ. ఓవర్‌నైట్ స్కోరు 263/3 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్... రెండో రోజు మొదటి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు జోడించింది.

భారత ఫీల్డర్లు క్యాచులను జారవిడచడం కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి బాగా కలిసొచ్చింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టుకి ఆ ప్రయోగం పెద్దగా కలిసి రావడం లేదు. కుల్దీప్ యాదవ్‌కి బదులుగా జట్టులోకి వచ్చిన షాబజ్ నదీం 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయా 100 పరుగులు ఇచ్చాడు.