Asianet News TeluguAsianet News Telugu

INDvsBAN 1st Test: టాస్ గెలిచిన టీమిండియా...  ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో...

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్ పర్యటనలో తొలిసారి టాస్ గెలిచిన టీమిండియా... శుబ్‌మన్ గిల్‌తో కెఎల్ రాహుల్ ఓపెనింగ్! కుల్దీప్ యాదవ్‌కి అవకాశం... 

INDvsBAN 1st Test: Team India won the toss and elected to bat first
Author
First Published Dec 14, 2022, 9:32 AM IST

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది.వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడిన టీమిండియా...తొలి టెస్టులో టాస్ గెలిచి, దాన్ని బ్రేక్ చేసింది. రోహిత్ శర్మ గాయపడడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు...

కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌కి వచ్చాడు. ఈ ఇద్దరూ మొదటి 6 ఓవర్లలో 21 పరుగులు జోడించారు. తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకొచ్చి, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే చోటు కల్పించడం విశేషం. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రాగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు...

వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. మహ్మద్ షమీ గాయపడడంతో 12 ఏళ్ల తర్వాత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న జయ్‌దేవ్ ఉనద్కట్... ఊహించినట్టుగానే రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్‌లో పిచ్‌, వాతావరణ పరిస్థితులు కూడా ఇండియాలోలాగే స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇదే ఉద్దేశంలో ముగ్గురు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకొచ్చింది భారత జట్టు..

శార్దూల్‌ ఠాకూర్‌కి తుది జట్టులో అవకాశం రావచ్చని అందరూ భావించినా కుల్దీప్ యాదవ్ రూపంలో ఓ అదనపు స్పిన్నర్ తుది జట్టులోకి రావడంతో అతనికి నిరాశే ఎదురైంది. గాయం కారణంగా తొలి టెస్టుకి ముందు ఆసుపత్రిలో చేరిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కోలుకుని నేటి టెస్టులో బరిలో దిగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ మాత్రం నేటి మ్యాచ్‌కి దూరమయ్యాడు. నేటి మ్యాచ్ ద్వారా జాకీర్ హసన్ టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. భారత్ ఏ జట్టుతో జరిగిన మ్యాచుల్లో రెండు సెంచరీలతో అదరగొట్టిన జాకీర్ హసన్... తొలి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలని ఆశపడుతున్న టీమిండియా... బంగ్లాతో రెండు టెస్టులను గెలవడం చాలా అవసరం. బంగ్లాదేశ్ ఒక్క టెస్టును డ్రా చేసుకోగలిగినా టీమిండియా ఫైనల్ ఆశలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా...

బంగ్లాదేశ్ తుది జట్టు: జాకీర్ హాసన్, నజ్ముల్ హుస్సేన్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రహీం, యాసిర్ ఆలీ, నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజ్ముల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబదత్ హుస్సేన్ 

టీమిండియా తుది జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ 

Follow Us:
Download App:
  • android
  • ios