Border Gavaskar Trophy 2023: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టులోనూ ఓడిన కంగారూలు సిరీస్ ను కోల్పోయారు. ఇక వాళ్లు ఆడాల్సింది డ్రా కోసమే.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండు టెస్టులలోనూ ఆసీస్ దారుణ ఓటమితో సిరీస్ ను కోల్పోయింది. నాగ్‌పూర్ తో పాటు ఢిల్లీ టెస్టులలో కనీస ప్రతిఘటన కూడా లేకుండా తలొంచింది. అయితే ఆస్ట్రేలియా ఇంత దారుణంగా ఓడుతుందన్న విషయం తనకు ముందే తెలుసంటున్నాడు ఆ జట్టు మాజీ సారథి మైఖెల్ క్లార్క్. ఈ టూర్ లో ఆస్ట్రేలియా.. వారం రోజుల ముందే భారత్ కు వచ్చినా ఒక్కటి కూడా టూర్ గేమ్ లేకపోవడం జట్టును కోలుకోలేని దెబ్బతీసిందని అన్నాడు.
ఢిల్లీ టెస్టులో ఓడిన తర్వాత క్లార్క్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఈ సిరీస్ లో వస్తున్న ఫలితాలను చూసి నేనేమీ ఆశ్చర్యపడటం లేదు. ఇది నేను ముందు ఊహించినదే. ఈ టూర్ లో ఆస్ట్రేలియా టీమ్ చేసిన అతి ప్రధానమైన తప్పు ఒక్కటైనా టూర్ గేమ్ ఆడకపోవడం. అది జట్టును బాగా దెబ్బతీసింది...
ఒక్క టూర్ గేమ్ అయినా ఆడి ఉంటే ఇక్కడి పరిస్థితుల మీద అవగాహన వచ్చి ఉండేది. దీనితో పాటు టీమ్ సెలక్షన్ కూడా చెత్తగా ఉంది. నాగ్‌పూర్ లో ట్రావిస్ హెడ్ ను తప్పించారు. అది చాలా తప్పు. ఇక ఢిల్లీ టెస్టులో ప్రతి ఆస్ట్రేలియా బ్యాటర్ స్వీప్ చేయడానికి యత్నించి వికెట్ పారేసుకున్నాడు. అసలు అక్కడున్న పరిస్థితుల్లో స్వీప్ చేయొచ్చా లేదా..? అన్నది కూడా ఆలోచించకుండా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు..
మీకు ఎంతమంది సపోర్ట్ స్టాప్ ఉన్నారన్నది కాదు. మీరు ఎలా ఆడారన్నదే ముఖ్యం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్నారంటే అదొక గౌరవంగా భావించాలి. ఒత్తిడిని స్వీకరించాలి. ఒకవైపు స్పిన్ ను ఎలా ఆడాలో భారత బ్యాటర్లు చూపిస్తున్నా వాళ్ల నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు. వాళ్లు ఆడినప్పుడు మీరెందుకు విఫలమవుతున్నారు..?..’అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రెండు టెస్టులలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గొప్పగా లేదని.. మరీ ముఖ్యంగా రెండో టెస్టులో భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించి దూరంగా ఫీల్డర్లను మొహరించడమేంటని ప్రశ్నించాడు. అలాంటప్పుడు 20 ఓవర్లలో మ్యాచ్ ఓడినా రెండున్నర రోజులలో ఓడినా పెద్ద తేడా లేదని విమర్శలు గుప్పించాడు.
