Asianet News TeluguAsianet News Telugu

ముంబైలోనే మొదలుపెట్టాలి.. కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి టీమిండియా..

INDvsAUS ODI: భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  శుక్రవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.  వాంఖెడే వేదికగా సిరీస్ లో తొలి మ్యాచ్ జరుగుతుంది. 

INDvsAUS : India Eye on another Series Win, ODI Series Starts From Tomorrow MSV
Author
First Published Mar 16, 2023, 10:50 PM IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో భాగంగా టెస్టులలో  ఆస్ట్రేలియా పనిపట్టిన టీమిండియా .. ఇప్పుడు వన్డే సిరీస్ మీద కన్నేసింది.  గత కొన్నాళ్లుగా వన్డేలలో  అత్యద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు సిరీస్ లు కోల్పోకుండా రాణిస్తున్న టీమిండియా.. పరిమిత ఓవర్ల  ఫార్మాట్ లో కూడా కంగారూలను కంగారెత్తించేందుకు సిద్ధమైంది.   మూడు వన్డేల సిరీస్ లో భాగంగా  రేపట్నుంచి  ముంబై (వాంఖెడే) వేదికగా తొలి వన్డే జరుగనుంది. వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని  జరుగుతున్న తొలి వన్డేలో  భారత్ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నది. 

వాంఖెడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.  టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఇది హోంగ్రౌండ్. కానీ  రేపటి మ్యాచ్ లో  అతడు ఆడటం లేదు. రోహిత్ తో పాటు  మరో ముంబై బ్యాటర్  శ్రేయాస్ అయ్యర్ కూడా   ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ కూ దూరంగా ఉన్నాడు. ఇది భారత్ కు ఎదురుదెబ్బే.. 

రోహిత్ తన బామ్మర్ది పెళ్లి కారణంగా తొలి వన్డే నుంచి తప్పుకోగా  అయ్యర్ వెన్ను నొప్పి గాయంతో దూరమయ్యాడు.  అయితే ఈ ఇద్దరూ లేకున్నా   ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న పంజాబ్ కుర్రాడు శుభ్‌మన్ గిల్  పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.  న్యూజిలాండ్ తో జనవరిలో ముగిసిన వన్డే సిరీస్ లో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ చేసిన గిల్.. అదే జట్టుపై టీ20లలో కూడా సెంచరీ బాదాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో కూడా సెంచరీ  చేశాడు. రోహిత్ గైర్హాజరీలో  భారత్ కు అతడు కీలకం కానున్నాడు.  

గిల్ తో పాటు వన్డేలలో  మంచి ఫామ్ లో ఉన్న  విరాట్ కోహ్లీ కూడా రాణిస్తే  అది భారత్ కు బోనస్ వంటిదే.  శ్రేయాస్ అయ్యర్ దూరమైన నేపథ్యంలో వన్డేలలో సూర్యకు ప్లేస్ దక్కొచ్చు. మరి ఈ టీ20 బ్యాటర్ వన్డేలలో ఏ మేరకు విజయవంతమవుతాడనేది  ఆసక్తికరం. రోహిత్ లేకపోవడంతో గిల్ కు తోడుగా తొలి వన్డేలో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రావొచ్చు.   మిడిలార్డర్ లో  హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు కూడా తలా ఓ చేయి వేస్తే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ ను సమర్థవంగా ఎదుర్కోవచ్చు.    

 

బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా బౌలింగ్ లో భారత బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం.  ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కథ వేరే ఉంది. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది.  వీరిలో అందరూ  అప్పటికప్పుడు మ్యాచ్ ను మలుపుతిప్పేవారే. ఈ లైనప్ ను నిలువరించడం టీమిండియాకు పెద్ద టాస్క్.  ఐసీసీ వన్డే  బౌలింగ్ ర్యాంకింగ్స్ లో  నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న సిరాజ్ తో పాటు షమీ,  హార్ధిక్ పాండ్యా ల పేస్ త్రయం ఎలా  నిలువరిస్తుందో చూడాలి.  స్పిన్నర్ల విషయంలో భారత్ కు తలనొప్పే. చాహల్, కుల్దీప్ లలో ఎవరిని ఎంచుకోవాలన్నది హార్ధిక్ ముందున్న సవాల్. 

పలు ప్రతికూలతల నడుమ సిరీస్ ను మొదలుపెట్టనున్న టీమిండియా..  ముంబైలోనే  ఆసీస్ ను తొలి దెబ్బ తీయాలని భావిస్తున్నది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  ఆసీస్ ను  2-1 తేడాతో ఓడించిన టీమిండియా..  వన్డే సిరీస్ లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. మరి  వాంఖెడేలో టీమిండియా ఏం చేసేనో..? 

Follow Us:
Download App:
  • android
  • ios