INDvsAUS 4th Test: అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా సాధించిన భారీ స్కోరుకు భారత్ ధీటుగానే సమాధానం చెబుతోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కూడా ఆస్ట్రేలియా మాదిరిగానే బ్యాటింగ్ పిచ్ లో నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు లంచ్ తర్వాత కూడా కాస్త నెమ్మదించినా వికెట్లను కాపాడుకుంటూనే భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (197 బంతుల్లో 103 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా అర్థ సెంచరీ దిశగా సాగుతున్న నయా వాల్ ఛటేశ్వర్ పుజారా (121 బంతుల్లో 42, 3 ఫోర్లు) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి భారత్ 63 ఓవర్లు ముగిసేటప్పటికీ రెండు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. గిల్ తో పాటు కోహ్లీ (0 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
ఈ ఏడాది వన్డేలు, టీ20లలో సూపర్ ఫామ్ లో ఉండి రెండు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన గిల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి ఇన్నింగ్స్ లో కూడా ఆ ఫామ్ ను కొనసాగించాడు. టెస్టులలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్ లో పుజారా కూడా తనదైన డిఫెన్స్ తో పాటు చూడచక్కని డ్రైవ్ లతో రాణించాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 113 పరుగులు జోడించారు.
మూడో రోజు ఉదయం ఓవర్ నైట్ స్కోరు 36-0తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ధాటిగానే ఇన్నింగ్స్ ను ఆరంభించింది. రోహిత్ శర్మ (35), గిల్ లు తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఈ జోడీని కున్హేమన్ విడదీశాడు. రోహిత్ నిష్క్రమించినా పుజారాతో కలిసి గిల్ మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
అర్థ సెంచరీ తర్వాత గిల్ 80 లలోకి చేరేంత వరకూ ఆచితూచి ఆడాడు. కానీ ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ వేసిన 56 వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90లలోకి వచ్చాడు. మర్ఫీ వేసిన 57వ ఓవర్లో తొలి బంతినే బౌండరీకి తరలించిన పుజారా కూడా 40లలోకి చేరాడు. ఇక లియాన్ వేసిన 60వ ఓవర్లో రెండో బంతిని గిల్ బౌండరీకి తరలించాడు. దీంతో గిల్ స్కోరు 96 పరుగులకు చేరింది. ఇక మర్ఫీ వేసిన 61 ఓవర్ రెండోబంతికి బౌండరీ బాది 194 బంతుల్లో సెంచరీ సాధించాడు. గిల్ కు భారత్ లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టులలో అతడికి ఇది రెండో సెంచరీ.
గిల్ సెంచరీ తర్వాతి ఓవర్ వేసిన మర్ఫీ భారత్ కు షాకిచ్చాడు. అర్థ సెంచరీ దిశగా సాగుతున్న పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులు బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) లు సెంచరీలతో కదం తొక్కారు.
