IND vs AUS 4th Test: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో  ఆస్ట్రేలియా కు భారత్ ధీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్  కూడా  నిలకడగా ఆడుతోంది.

తొలి మూడు టెస్టులకు భిన్నంగా బ్యాటింగ్ కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్ పై కంగారూల మాదిరిగానే భారత బ్యాటర్లు కూడా పరుగుల పండుగ చేసుకుంటున్నారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (235 బంతుల్లో 128, 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో రాణించగా పుజారా (42), రోహిత్ శర్మ (25) కూడా ఫర్వాలేదనిపించారు. చాలాకాలంగా టెస్టులలో ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ (128 బంతుల్లో 59 నాటౌట్, 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి తోడుగా జడేజా (54 బంతుల్లో 16, 1 సిక్స్) కూడా క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 99 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది.

మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 36-0తో ఆట ఆరంభించిన భారత్ ఆది నుంచి ఆచితూచి ఆడింది. బౌలర్లకు పెద్దగా సహకరించని పిచ్ పై రోహిత్, గిల్ లు బాగానే బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకుంటున్న రోహిత్ ను కున్హేహన్ ఔట్ చేశాడు.

గిల్ సెంచరీ.. 

ఆ తర్వాత వచ్చిన పుజారాతో కలిసి గిల్ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నాడు. లంచ్ కు ముందే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. ఆ తర్వాత మర్ఫీ వేసిన 61 ఓవర్ రెండోబంతికి బౌండరీ బాది 194 బంతుల్లో సెంచరీ సాధించాడు. గిల్ కు భారత్ లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టులలో అతడికి ఇది రెండో సెంచరీ. ఇటీవల వరుసగా విఫలమవుతున్న పుజారా కూడా ఆసీస్ స్పిన్ త్రయం, పేసర్లను బాగానే ఎదుర్కున్నాడు. హాఫ్ సెంచరీ దిశగా కదులుతున్న అతడు.. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు మర్ఫీ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో రెండో వికెట్ భాగస్వామ్యానికి (113 రన్స్) తెరపడింది. 

విరాట్ షో.. 

టీ విరామం తర్వాత కొంతసేపు విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన గిల్.. లియాన్ వేసిన 78వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. గిల్ -విరాట్ లు మూడోవికెట్ కు 58 పరుగులు జోడించారు. గిల్ ఔటవ్వడంతో ఒత్తిడి పెంచి వికెట్లు కూల్చుదామనుకున్న ఆసీస్ ఆశలపై విరాట్ నీళ్లు చల్లాడు. లియాన్ వేసిన ఇన్నింగ్స్ 93 వ ఓవర్లో నాలుగో బంతికి కోహ్లీ.. రెండు పరుగులు తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2022 జనవరి తర్వాత (16 టెస్టు ఇన్నింగ్స్ లు) కోహ్లీకి ఇదే తొలి అర్థ సెంచరీ కావడం విశేషం.

కోహ్లీ, జడేజాలు క్రీజులో ఉండటం శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, అశ్విన్ లు బ్యాటింగ్ కు రావాల్సి ఉండటంతో భారత జట్టు ఆసీస్ స్కోరు (480) ను అధిగమించడం పెద్ద కష్టేమేమీ కాదు. అదీగాక పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండటంతో రేపు కూడా ఇదే తరహా ఆట ఆడితే ఈ టెస్టులో భారత్ పైచేయి సాధించే అవకాశాలుంటాయి. ప్రస్తుతానికి మరో రెండు రోజుల ఆటే మిగిలుండటం.. ఇంకా ఇరు జట్లవి ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాకపోవడంతో ఈ టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అసాధ్యం...!