INDvsAUS: ఇండియా- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో మూడో రోజు ఆట మొదలైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన నేపథ్యంలో భారత్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో నేడు అత్యంత కీలకం. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేదే నేడే. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఆఖరి సెషన్ లో భారత్.. 10 ఓవర్లు ఆడి 36 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (18 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట కూడా ప్రారంభమైంది.
బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు పండుగ చేసుకున్న విషయం తెలిసిందే. ఉస్మాన్ ఖవాజా (180) డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ తన కెరీర్ లో తొలి టెస్టు శతకం (114) బాదేశాడు. ఆఖరికి చివరి వరుస బ్యాటర్లు అయిన టాడ్ మర్ఫీ (41), నాథన్ లియాన్ (34) లు కూడా ఓ చేయి వేశారు.
తొలి రెండు రోజులు బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ మూడో రోజు కూడా అలాగే స్పందించొచ్చు. భారీ టర్న్ అయ్యే అవకాశాలు లేవని ఇప్పటికే పిచ్ క్యూరేటర్లు హింట్ ఇచ్చిన నేపథ్యంలో నేడు ఆసీస్ బౌలింగ్ దాడిని భారత బ్యాటర్లు ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నేడు క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధిస్తేనే ఈ టెస్టును డ్రా చేసుకునే దిశగా భారత్ అడుగులు వేయగలదు.
నేడు మొత్తం టాపార్డర్ బ్యాటింగ్ చేయగలిగి మెరుగైన స్కోరు సాధిస్తే అప్పుడు ఆస్ట్రేలియాపై ఆధిక్యాన్ని సాధించడమే గాక ఆఖరి రోజు బంతి ఏమైనా స్పిన్ కు సహకరిస్తే కంగారూలకు షాకిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. అలా జరగాలంటే నేడు భారత బ్యాటర్లు ఆడే ఆట చాలా కీలకం.
ముఖ్యంగా భారత సీనియర్ బ్యాటింగ్ త్రయం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పుజారా లు రాణించడం భారత్ కు చాలా అవసరం. వీరితో పాటు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లు కూడా ఓ చేయి వేస్తే ఆసీస్ చేసిన 480 పరుగుల మార్కును దాటడం పెద్ద కష్టమేమీ కాదు. మరి భారత బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ సిరీస్ లో వికెట్ల పండుగ చేసుకున్న అశ్విన్, జడేజాలు అహ్మదాబాద్ లో వికెట్లు తీయడానికి మాత్రం నానా తంటాలుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆసీస్ స్పిన్ త్రయం నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, కున్హెమన్ లకు పిచ్ పై టర్న్ ను రాబట్టడం అంత తేలిక కాకపోవచ్చు. కానీ ఎప్పుడెలా ఆడతారో తెలియని భారత క్రికెటర్లు ఎలాంటి షాకులివ్వకుంటే ఈ టెస్టులో భారత్ గట్టెక్కేందుకు అవకాశాలుంటాయి.
