రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్.. మూడో రోజు తొలి సెషన్‌లో 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు 115 పరుగుల టార్గెట్.. 

ఢిల్లీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు ఆధిక్యం సంపాదించి, రెండో రోజు 12 ఓవర్లలో 61 పరుగులు చేసి భారత బౌలర్లు టెన్షన్ పెట్టిన ఆస్ట్రేలియా... మూడో రోజు అదే జోరు చూపించలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 61/1 స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లో 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ట్రావిస్ హెడ్‌ని అశ్విన్ మూడో రోజు తొలి ఓవర్‌లో అవుట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనం, గంటన్నరలో ఆలౌట్ అయ్యేదాకా సాగింది.. 

46 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోరుకి 4 పరుగులు జోడించి తొలి వికెట్ కోల్పోయింది ఆసీస్...

19 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్‌ని డకౌట్ చేసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అవుట్ చేశాడు. స్టీవ్ స్మిత్‌ని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అవుట్ చేసిన తొలి స్పిన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్..

50 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్‌లో లబుషేన్, జడ్డూ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇది మూడోసారి. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది ఆసీస్...

8 బంతుల్లో 2 పరుగులు చేసిన మ్యాట్ రెంషా, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 3 బంతులాడిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ప్యాట్ కమ్మిన్స్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు జడేజా...

దీంతో ఒకానొక దశలో 85/2 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా, 10 పరుగుల తేడాతో 95/7 స్థితికి చేరుకుంది..

10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా, 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ కుహ్నేమన్‌ని జడేజా డకౌట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి 113 పరుగుల వద్ద తెరపడింది..

రెండో ఇన్నింగ్స్‌లో 31.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెండో రోజు 12 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 62 పరుగులు చేయగా, మూడో రోజు 51 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది.. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 7 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు...

రవీంద్ర జడేజా తీసిన 7 వికెట్లలో ఐదు వికెట్లు క్లీన్ బౌల్డ్ ద్వారా వచ్చినవే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జడ్డూ, టెస్టులో 10 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.