INDvsAUS 2nd Test: ఢిల్లీ టెస్టులో  లియాన్.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన  లియాన్..  రెండో టెస్టులో మాత్రం మెరిశాడు. 

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లియాన్.. ఐదు వికెట్లతో చెలరనేగిన విషయం తెలిసిందే. తద్వారా అతడు బీజీటీలో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ ల పేరిట ఉండేది.

ఢిల్లీ టెస్టులో లియాన్.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన లియాన్.. రెండో టెస్టులో మాత్రం చెలరేగాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, పుజరా, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా అతడి బౌలింగ్ లోనే ఔటయ్యారు. 

కాగా ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడం ద్వారా బీజీటీలో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచిన లియాన్.. మొత్తంగా భారత్ పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గానూ నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 139 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 105 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో లియాన్ (100) చేరాడు. 

కాగా బీజీటీలో కుంబ్లే.. ఆస్ట్రేలియాతో 20 టెస్టులు ఆడాడు. ఈ 20 టెస్టులలో ఏకంగా 111 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్థానంలో అశ్విన్ నిలిచాడు. ఈ సిరీస్ కు ముందు అశ్విన్.. బీజీటీలో 89 వికెట్లు తీసి ఈ జాబితాలో కుంబ్లే, హర్భజన్ సింగ్ (95 వికెట్లు), నాథన్ లియన్ (94 వికెట్లు) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో అశ్విన్.. తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు (మొత్తంగా 8) పడగొట్టాడు. తద్వారా బీజీటీలో ఆసీస్ పై 97 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇక ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా వంద వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఇప్పుడు లియాన్ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. 


Scroll to load tweet…

ఆదుకున్న అక్షర్ - అశ్విన్ ఔట్.. 

ఢిల్లీ టెస్టులో భారత జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లు వెంటవెంటనే ఔటవడంతో టీమిండియా ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది. 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అశ్విన్ - అక్షర్ ల జోడీని కొత్త బంతితో ఆసీస్ బోల్తా కొట్టించింది. తొలుత పాట్ కమిన్స్ .. అశ్విన్ (37) ను ఔట్ చేయగా తర్వాత అక్షర్ (74) ను టాడ్ మర్ఫీ పెవిలియన్ కు పంపాడు. ఫలితంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్.. 83 ఓవర్లు ముగిసేటప్పటికీ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.