INDvsAUS 2nd Test: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్   మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  భాగంగా గతంలో ఈ రికార్డు అందుకున్న అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కంగారూలను మరోసారి తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లు తలా మూడు వికెట్లు తీసి ఆసీస్ భారీ స్కొరు చేయకుండా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్ లో అశ్విన్ మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్ కు షాకులిచ్చాడు. 

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్.. ఒకే ఓవర్లో లబూషేన్, స్టీవ్ స్మిత్ లను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఔట్ చేశాడు. తద్వారా అశ్విన్ బీజీటీ లో అరుదైన ఘనతను అందుకున్నాడు. క్యారీని ఔట్ చేయడం ద్వారా బీజీటీలో వంద వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. 

ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే మాత్రమే అశ్విన్ కంటే ముందున్నాడు. కుంబ్లే.. ఆస్ట్రేలియాతో 20 టెస్టులు ఆడాడు. ఈ 20 టెస్టులలో ఏకంగా 111 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 8-141. బీజీటీలో కుంబ్లే.. పదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. స్వదేశంలో ఆసీస్ ను భారత్ నిలువరించడంలో కుంబ్లేది కీలక పాత్ర. 

ఈ సిరీస్ కు ముందు అశ్విన్.. బీజీటీలో 89 వికెట్లు తీసి ఈ జాబితాలో కుంబ్లే, హర్భజన్ సింగ్ (95 వికెట్లు), నాథన్ లియన్ (94 వికెట్లు) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో అశ్విన్.. తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు (మొత్తంగా 8) పడగొట్టాడు. తద్వారా బీజీటీలో ఆసీస్ పై 97 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇక ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా వంద వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. 

Scroll to load tweet…

నాగ్‌పూర్ టెస్ట్ కంటే ముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా 94 వికెట్లతో అశ్విన్ కంటే ముందు ఉండేవాడు. కానీ తొలి టెస్టులో లియాన్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడు 95 వికెట్ల వద్దే ఆగిపోయాడు. మరో రెండు ఇన్నింగ్స్ లలో ఇదే ఫామ్ ను కొనసాగిస్తే బీజీటీలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్న కుంబ్లేను దాటడం అశ్విన్ కు పెద్ద కష్టమేమీ కాదు.

కాగా ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81), మిడిలార్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్) లు రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్ (33) కూడా రాణించాడు. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ వన్ (లబూషేన్-18), నెంబర్ టూ (స్మిత్-0) లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరినీ అశ్విన్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు.


Scroll to load tweet…