స్వదేశంలో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్... వన్డే సిరీస్‌కి కూడా కెప్టెన్సీ చేయనున్న స్టీవ్ స్మిత్.. వ్యక్తిగత కారణాలతో మొదటి వన్డేకి దూరంగా రోహిత్ శర్మ..
భారత పర్యటనలో టెస్టు సిరీస్ గెలవాలనే ఆస్ట్రేలియా కల నెరవేరలేదు. ఐసీసీ నెం.1 టెస్టు టీమ్ హోదాలో ఇండియాలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చినా.. అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత జట్టు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లాడు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. ఆయన తల్లి మరియా, దాదాపు 15 రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో పోరాడి, ప్రాణాలు విడిచింది. ప్యాట్ కమ్మిన్స్ గైర్హజరీలో మూడో టెస్టుకి సారథిగా వ్యవహరించి, ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించాడు స్టీవ్ స్మిత్...
స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆడిన నాలుగో టెస్టులోనూ ఆస్ట్రేలియా మంచి ఆటతీరు కనబర్చింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌కి కూడా స్టీవ్ స్మిత్‌నే కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్యాట్ కమ్మిన్స్, కుటుంబంతో కొన్నాళ్లు గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతను వన్డే సిరీస్‌కి కూడా అందుబాటులో ఉండడం లేదు..
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2023 సీజన్ నుంచి కూడా తప్పుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఆస్ట్రేలియాలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కి స్టీవ్ స్మిత్ సారథ్యం వహించబోతున్నాడు...
వాస్తవానికి వైట్ బాల్ క్రికెట్‌కి ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా ఉంటే, వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలనేది ప్రాథమిక రూల్. అయితే టెస్టు సిరీస్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీని మెచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతనికి సారథ్యం ఇస్తే పర్ఫామెన్స్ బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...
మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరగనుంది. వ్యక్తిగత కారణాలతో ఈ వన్డే మ్యాచ్‌కి దూరంగా ఉంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో తొలి మ్యాచ్‌కి వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
విశాఖపట్నంలో జరిగే రెండో వన్డేకి రోహిత్ శర్మ, టీమ్‌తో తిరిగి కలుస్తాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉండడంతో ఈ వన్డే సిరీస్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అలాగే వన్డే సిరీస్‌కి ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ గాయంతో బాధపడుతున్నాడు. వెన్నునొప్పితో అహ్మదాబాద్ టెస్టులో బ్యాటింగ్‌కి రాని శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి...
శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఏ ప్లేయర్‌ని ఎంపిక చేస్తున్న విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. గత ఏడాది వన్డేల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది..
రెండో టెస్టులో గాయపడి టెస్టు సిరీస్‌కి దూరమైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు వైట్ బాల్ క్రికెట్ స్పెషలిస్ట్ ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా, అస్టన్ అగర్... ఇప్పటికే ఇండియాకి చేరుకున్నారు...
టెస్టు సిరీస్‌కి ఎంపికైన స్పిన్నర్ అస్టన్ అగర్, మ్యాట్ కుహ్నేమన్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మ్యాట్ కుహ్నేమన్ నెట్ సెషన్స్‌లో చూపించిన బౌలింగ్ పర్ఫామెన్స్‌కి మెచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతన్ని తుది జట్టులో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023కి ప్రకటించిన జట్టులో లేని మ్యాట్ కుహ్నేమన్ టీమ్‌లోకి రావడంతో అస్టన్ అగర్... స్వదేశానికి తిరిగి వెళ్లి దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు..
వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్, సీన్ అబ్బాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
