Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS: తొలి వన్డేలో టాస్ గెలిచిన హార్ధిక్ పాండ్యా.. బౌలింగ్ చేయనున్న ఇండియా

INDvsAUS 1st ODI: నెల రోజులుగా  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టు మ్యాచ్ లు ఆడిన భారత్ - ఆస్ట్రేలియా లు ఇప్పుడు  మరో ఫార్మాట్ లో తలపడుతున్నాయి. వాంఖెడే వేదికగా తొలి వన్డే ఆడుతున్నాయి.  

INDvsAUS 1st ODI: India Won The Toss and Elects Bowl First vs Australia MSV
Author
First Published Mar 17, 2023, 1:04 PM IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నెల రోజుల క్రితం భారత్ కు వచ్చిన  ఆస్ట్రేలియాను టెస్టులలో 2-1 తేడాతో ఓడించిన టీమిండియా.. నేటి నుంచి వన్డే సిరీస్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.  భారత జట్టు రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ తో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల గైర్హాజరీలో టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, కంగారూ టీమ్ కు స్టీవ్ స్మిత్ సారథులుగా వ్యవహరిస్తున్నారు.  ముంబైలోని ప్రఖ్యాత స్టేడియం వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  టీమిండియా టాస్ గెలిచి తొలుత  బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాటింగ్ కు రానుంది.

బంతితో పాటు బ్యాట్ కూ అనుకూలించే  వాంఖెడే పిచ్ పై రెండు అగ్రశ్రేణి జట్లు హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని సాగుతున్న ఈ పోరులో వరల్డ్ కప్ టీమ్ లో తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు.  

గాయం కారణంగా సుమారు ఐదు నెలల పాటు  అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న జడేజా ఇటీవల టెస్టు జట్టులోకి  అరంగేట్రం చేశాడు. ఇప్పుడు జడ్డూ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్ తో  జోడీగా ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ను  ప్రారంభించనున్నాడు.  కెఎల్ రాహుల్ రూపంలో మరో ఆప్షన్ ఉన్నా అతడిని మిడిలార్డర్ లోనే ఆడించనుంది టీమ్ మేనేజ్మెంట్. శ్రేయాస్ అయ్యర్ గాయంతో  టీ20లలో  వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్  సూర్యకుమార్ యాదవ్  తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.  ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న కోహ్లీ, కెప్టెన్ హార్ధిక్ పాండ్యాలతో భారత  బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తున్నది.  

బౌలర్లలో కూడా  వన్డేలలో వరల్డ్ నెంబర్ బౌలర్ సిరాజ్ కు తోడుగా షమీ, సిరాజ్, పాండ్యాలు ఆస్ట్రేలియా ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం. స్పిన్నర్లలో  పాండ్యా.. చాహల్ ను పక్కనబెట్టి కుల్దీప్ కే ఓటు వేశాడు. 

ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది.  వీరిలో అందరూ  అప్పటికప్పుడు మ్యాచ్ ను మలుపుతిప్పేవారే. ఈ లైనప్ ను నిలువరించడం టీమిండియాకు పెద్ద టాస్క్.   

పిచ్ గురించి.. 

వాంఖెడే పిచ్ బౌలర్లతో పాటు బ్యాటర్లకూ అనుకూలంగా ఉంటుంది.   మూడేండ్ల తర్వాత ఇక్కడ వన్డే జరుగుతున్నది. 2020లో ఇదే ఆస్ట్రేలియాపై భారత్ ఆడింది.  భారత్ 255 పరుగులకే  ఆలౌట్ కాగా ఆసీస్ వికెట్ నష్టపోకుండా  మ్యాచ్ ను గెలుచుకుంది.  మరి నేటి మ్యాచ్ లో  భారత్ ఏం చేస్తుందో..? నని టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇలా చూడొచ్చు :   ఇండియా - ఆస్ట్రేలియా  వన్డే సిరీస్ ను  స్టార్ నెట్వర్క్ లతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు. డీడీ  స్పోర్ట్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారాలున్నాయి. 

తుది జట్లు :  

ఇండియా :  శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్,  కుల్దీప్ యాదవ్ 

ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్,  స్టీవ్ స్మిత్ (కెప్టెన్) , మార్నస్ లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ 

Follow Us:
Download App:
  • android
  • ios