IndW vs AusW: భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియా టీమ్ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 26 వన్డే విజయాలతో రికార్డులు నెలకొల్పుతున్న కంగారూలకు భారత మహిళల టీం షాకిచ్చింది.

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. ఓటమనేదే లేకుండా వరుసగా 26 మ్యాచులలో విజయబావుటా ఎగురవేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టును మన అమ్మాయిలు నేలకు దించారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య జట్టు 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో గార్డ్నర్ (62 బంతుల్లో 67) పరుగులు చేయగా మూనీ (52), టహిలా మెక్ గ్రాత్ (47) ఆదుకోవడంతో కంగారూలు గౌరవ ప్రదమైన స్కోరును భారత్ ముందుంచారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వస్త్రాకార్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేదన ప్రారంభించిన భారత్ కు షెఫాళి వర్మ (56), మంధానా (22) శుభారంభాన్నిచ్చారు. వన్ డౌన్ లో వచ్చిన యశ్టిక భాటియా (64) పోరాటానికి తోడు చివర్లో స్నేహ రానా (30) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ రెండె వికెట్ల తేడాతో విజయం సాధించింది. కంగారూల రికార్డులకు భారత్ కళ్లెం వేసినా సిరీస్ మాత్రం 2-1 తేడాతో ఆసీస్ వశమైంది.

Scroll to load tweet…

ఇదిలాఉండగా ఆసీస్ విజయాల పరంపరకు భారత్ అడ్డుకట్ట వేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో వరుసగా 16 టెస్టులు గెలిచి జోరు మీదున్న ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు 2001లో భారత్ బ్రేక్ వేసింది. ఇదే క్రమంలో 2008లోనూ ఓటమనేదే లేకుండా 22 టెస్టులు గెలిచిన కంగారూలకు భారత్ పరాజయం రుచి చూపించింది. వరుసగా నాలుగు వరల్డ్ కప్ సెమీస్ లలో ప్రవేశించగా.. 2011లో టీమ్ ఇండియా దానికి చెక్ పెట్టింది. తాజాగా ఆసీస్ మహిళల జట్టు 26 వన్డే విజయాలతో రికార్డులు సృష్టిస్తుండగా.. మళ్లీ భారతే ఆ గెలుపు పరంపరకు అడ్డుకట్ట వేయడం గమనార్హం.