Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022 లో భాగంగా ఆడుతున్న మహిళా క్రికెట్ పోటీలలో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. 

24 ఏండ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడలలో రీఎంట్రీ ఇచ్చిన క్రికెట్ పోటీలలో సెమీస్ బెర్త్‌లు కన్ఫర్మ్ అయ్యాయి. రెండు గ్రూపులుగా విభజించిన ఈ పోటీలలో గ్రూప్-ఏ, గ్రూప్-బీ లలో టాప్-2 గా నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్ లు సెమీఫైనల్ చేరగా.. గ్రూప్-బి నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లు వెళ్లాయి. ఈ క్రమంలో సెమీస్ లో ఏ ఏ జట్లు.. ఎవరెవరితో పోటీ పడనున్నాయంటే.. 

గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ తో సెమీస్ పోరులో తలపడనుంది. మరోవైపు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా.. గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుంది. 

సెమీస్ షెడ్యూల్ : 

- ఆగస్టు 6న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (ఎడ్జ్‌బాస్టన్- బర్మింగ్‌హామ్) 
- ఆగస్టు 6న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ (ఎడ్జ్‌బాస్టన్- బర్మింగ్‌హామ్)

సెమీస్ లో నెగ్గిన విజేతలు ఆదివారం జరిగే తుది పోరులో స్వర్ణం, రజతం కోసం పోరాడతాయి. ఇక సెమీస్ లో ఓడిన పరాజిత జట్లు కూడా అదే రోజు కాంస్యం కోసం పోటీ పడనున్నాయి. 

Scroll to load tweet…

సెమీస్ కు భారత్, ఇంగ్లాండ్ ఎలా చేరాయంటే... 

స్వర్ణ పతకమే లక్ష్యంగా ఈ పోటీలలోకి అడుగుపెట్టిన భారత జట్టు తొలుత ఆస్ట్రేలియాతో పోటీ పడింది. తొలుత బ్యాటింగ్ చేసి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతో కంగారూలను వణికించింది. కానీ ఆష్లే గార్డ్‌నర్ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో తొలి మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పలేదు. కానీ తర్వాత భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. అదే ఊపులో రెండ్రోజుల క్రితం బార్బడోస్ ను ఓడించి సెమీస్ కు చేరింది.

ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచింది. శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లను చిత్తు చేసి సెమీస్ కు వెళ్లింది.