ICC Under-19 World Cup 2022:  భారత జట్టుకు గతంలో వికెట్ కీపర్ బ్యాటర్ల కొరత వేధించేది.  వికెట్ కీపర్లు పెద్దగా బ్యాటింగ్ లో రాణించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ ధోని  పరిస్థితిని మార్చాడు. ఇప్పుడు అతడి బాటలో..

అది 2011 వన్డే ప్రపంచకప్. ఘన చరిత్ర కలిగిన ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్-శ్రీలంకల మధ్య ఫైనల్. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు.. గంభీర్(97) సాయంతో అప్పటి సారథి ధోని (91నాటౌట్).. భారత్ ను విజయానికి చేరువచేశాడు. 48వ ఓవర్ కులశేఖర వేశాడు. అప్పటికీ భారత స్కోరు 271.. విజయానికి మరో నాలుగు పరుగులు కావాలి. క్రీజులో ధోని.. 48వ ఓవర్లో కులశేఖర రెండో బంతి విసిరాడు. ఆ బంతిని ధోని లాంగాన్ మీదుగా సిక్సర్ తరలించాడు. అంతే.. 28 ఏండ్ల తర్వాత భారత్ కు రెండో వన్డే ప్రపంచకప్... 

కట్ చేస్తే.. సరిగ్గా పదకొండు ఏండ్ల తర్వాత అదే సీన్ రిపీట్ అయింది. విండీస్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ ఫైనల్. ఇండియా-ఇంగ్లాండ్ లు తలపడ్డాయి. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్.. 44.5 ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. 47వ ఓవర్లో విజయానికి చేరువైంది. రెండో బంతికి సింగిల్ తీసిన నిశాంత్ సింధు.. దినేశ్ బన కు బ్యాటింగ్ ఇచ్చాడు. మూడో బంతికి సిక్సర్. స్కోరు సమానమైంది. అప్పటికీ భారత్ విజయానికి ఇంకా ఒక్క పరుగు కావాలి. నాలుగో బంతిని సేల్స్ ఫుల్ టాస్ వేశాడు. అంతే.. అచ్చం ధోనిని గుర్తు చేస్తూ.. బన ఆ బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్.. అంతే భారత్ ఐదో అండర్-19 ప్రపంచకప్ విజేత. 

View post on Instagram

ఇప్పుడు టీమిండియా లో ఇదే హాట్ టాపిక్. ట్విట్టర్ వేదికగా ధోని, దినేశ్ బన ల మ్యాచ్ విన్నింగ్ సిక్సర్ల కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దినేశ్ బనను అందరూ ధోని తో పోలుస్తున్నారు. యాధృశ్చికంగా దినేశ్ కూడా ధోని మాదిరిగా వికెట్ కీపరే కావడం గమనార్హం. 

ధోనిని ఎంతగానో అభిమానించే దినేశ్ కూడా అతడిలాగే గొప్ప ఫినిషర్ కావాలని కలలు కంటున్నాడు. ఈ టోర్నీ లో కూడా అతడు కొన్ని మెరుపులు మెరిపించాడు. సెమీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 48 వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన బన సునామీ సృష్టించాడు. నాలుగు బంతులే ఆడి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు సాధించాడు. ఇక నిన్నటి మ్యాచులో కూడా ఐదు బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లే ఉండటం విశేషం. 

Scroll to load tweet…

కాగా.. దినేశ్ ప్రదర్శన పట్ల టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ధోని మాదిరిగానే ఫినిషర్ లక్షణాలు పుష్కలంగా ఉన్న దినేశ్.. భవిష్యత్ లో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నారు.