అండర్-19 వరల్డ్ కప్ విజేతలకు నరేంద్ర మోడీ స్టేడియంలో ఘన సత్కారం.. సచిన్ ప్రశంసలు
BCCI: ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ తొలి అండర్ - 19 మహిళల ప్రపంచకప్ ను దక్కించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా సత్కారం జరిగింది.

ఐసీసీ నిర్వహించిన తొలి అండర్ - 19 ప్రపంచకప్ గెలిచిన షెఫాలీ వర్మ సారథ్యంలోని యువ భారత జట్టుకు అహ్మదాబాద్ లో ఘన సత్కారం దక్కింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇందుకు వేదికైంది. భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా లతో పాటు టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లు హాజరై అమ్మాయిలపై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టుకు బీసీసీఐ రూ. 5 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన చెక్ ను నేడు సచిన్ తో పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు.. యువ భారత్ కు అందజేశారు.
అహ్మదాబాద్ లో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ షెఫాలీ సేనకు కృతజ్ఞతలు తెలిపాడు. తన ప్రసంగానికి ముందు సచిన్.. గుజరాత్ లో అభిమానులకు అభివాదం చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం సచిన్.. భారత మహిళల జట్టుకు మంచి భవిష్యత్ ఉందని, షెఫాలీ సేనను చూసి దేశం గర్విస్తుందని అన్నాడు. తాను పదేండ్ల వయసు ఉన్నప్పుడు వరల్డ్ కప్ గెలవాలని కలలు కన్నానని, కానీ అండర్ - 19 టీమ్ మాత్రం దేశంలో చాలా మంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చిందని కొనియాడాడు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ఐపీఎల్ తో భారత మహిళా క్రికెట్ స్వరూపమే మారబోతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక అండర్ - 19 ప్రపంచకప్ ఫైనల్ లో తొలుత ఇంగ్లాండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. తర్వాత లక్ష్యాన్ని 14 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు, కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ రూ. 5 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.