కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరుపున తొలి సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా... తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయినా, రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన భారత టెస్టు బ్యాటర్...

పేలవ ఫామ్‌తో టీమిండియా టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా... కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022 సీజన్‌లో ఘనమైన ప్రారంభం దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఛతేశ్వర్ పూజారాని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంలో కౌంటీల్లో ఆడలేకపోయాడు పూజారా... సీఎస్‌కే తరుపున ఎంపికైనా, సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు... 

గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో వీరోచిత ఇన్నింగ్స్‌ల తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఒక్కటీ ఇవ్వలేకపోయిన ఛతేశ్వర్ పూజారా... సౌతాఫ్రికా పర్యటన తర్వాత భారత టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.. 

తిరిగి ఫామ్ నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో పాల్గొన్న ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ క్లబ్ తరుపున బరిలో దిగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లో 6 పరుగులు చేసి అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు ఛతేశ్వర్ పూజారా...

తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 505 పరుగుల భారీ స్కోరు చేసింది డర్బీషైర్. పాకిస్తాన్ బ్యాటర్ షాన్ మసూద్ 239 పరుగులు చేయగా ఇంగ్లాండ్ బ్యాటర్ వేన్ మ్యాడ్‌సన్ 111 పరుగులు చేశాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ అయిన ససెక్స్, ఫాలోఆన్‌లో పడింది. కెప్టెన్ టామ్ హేన్స్ 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఫాలోఆన్‌లో ససెక్స్ 140 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. అలిస్టైయిర్ ఓర్ 28, టాప్ అల్సాప్ 16 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ టామ్ హేన్స్ 216 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. టూ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఛతేశ్వర్ పూజారా 272 బంతుల్లో 16 ఫోర్లతో 121 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నాడు... ఛతేశ్వర్ పూజారాకి ఇది 51వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. 

Scroll to load tweet…

ఇప్పటికే ససెక్స్ 63 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీ ప్లేఆఫ్స్ జరగబోతున్నాయి. పూజారా ప్రాతినిధ్యం వహించిన సౌరాష్ట్ర జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడంతో ఆ మ్యాచుల్లో రాణించి, తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఛతేశ్వర్ పూజారా... 

ఛతేశ్వర్ పూజారాతో పాటు ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అమ్ముడుపోని భారత టెస్టు ప్లేయర్ హనుమ విహారి, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొని అదరగొట్టాడు. పూజారాతో కలిసి భారత జట్టుకి ఎన్నో టెస్టు విజయాలు అందించిన అజింకా రహానే మాత్రం ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున బరిలో దిగుతున్నాడు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన 5 మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన అజింకా రహానే, సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో విఫలం కావడంతో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రహానేని తప్పించి ఆరోన్ ఫించ్‌ని ఆడించింది కేకేఆర్.