ప్రతీ క్రికెటర్‌కి కెరీర్‌లో వందో టెస్టు చాలా అపురూపం. అయితే భారత జట్టుతో కలిసి గబ్బాలో తన వందో టెస్టు ఆడిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌కి వందో టెస్టు మధురానుభూతులను మిగల్చలేకపోయింది. స్పిన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకునే భారత బ్యాట్స్‌మెన్, నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో ఈజీగా పరుగులు రాబట్టారు. 

ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో లియన్ ఓ వికెట్ దక్కగా, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు దక్కాయి. అయితే వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌కి జ్ఞాపకంగా భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన భారత జెర్సీని అందచేశాడు భారత కెప్టెన్ అజింకా రహానే.

మ్యాచ్ అనంతరం భారత జట్టు తరుపున ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రహానేకి నాథన్ లియాన్ కృతజ్ఞతలు తెలిపాడు. సిరీస్‌లో 21 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలవగా, రిషబ్ పంత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.