Happy Birthday IPL: భారత క్రికెట్ కు కాసుల పంట కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు  ఇవాళ పుట్టినరోజు. సరిగ్గా 15 ఏండ్ల క్రితం (2008) ఐపీఎల్ లో ఏప్రిల్ 18న తొలి మ్యాచ్ జరిగింది.

భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ రూపురేఖలను మార్చిన ఐపీఎల్ పదిహేనవ వసంతాలు పూర్తి చేసుకుంది. 2008లో ఈ లీగ్ మొదలైనప్పుడు ఇంతటి ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 2007లో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బుర్రలో మెదిలిన ఈ ఆలోచన ఇవాళ భారత క్రికెట్ కు కాసులు కురిపిస్తున్నది. 2007లో వింబుల్డన్ మ్యాచ్ చూడటానికి ఇంగ్లాండ్ వెళ్లిన లలిత్ మోడీ.. అక్కడ కొంత మంది మిత్రులతో కలిసి ‘నేను భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మారుస్తాను’ అని ఏ ఉద్దేశంలో చెప్పాడో గానీ.. ఆ ప్రభావం ఇండియన్ క్రికెట్ మీద ఆయన చెప్పినదానికంటే ఓ పది రెట్లు అధికంగానే ఉందనడంలో సందేహమే లేదు. 

వందలాది మంది నాణ్యమైన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది ఐపీఎల్.. ఒక్క ఇండియాకే కాదు, ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మంది విదేశీ ఆటగాళ్లు తర్వాత వారి దేశాల తరఫున స్టార్ ఆటగాళ్లుగా కూడా మారారు. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, జేసన్ రాయ్, ఏబీ డివిలియర్స్, షకిబ్ అల్ హసన్ ఇలా వెలుగులోకి వచ్చినవారే. ఇక భారత్ లో ఈ జాబితాకు లెక్కే లేదు. 

తొలి మ్యాచ్ ఆ ఇద్దరి మధ్యే.. 

పదిహేనేళ్ల కాలంలో సుమారు 900కు పైగా మ్యాచులు జరిగిన ఐపీఎల్ లో మొట్ట మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లోనే ఈ లీగ్ అసలు ఉద్దేశం అర్థమైపోయింది అభిమానులకు. ఆ మ్యాచ్ లో కేకేఆర్ తరఫున ఆడిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్.. తొలి మ్యాచ్ లోనే సెంచరీ (158 నాటౌట్) తో కదం తొక్కాడు. 

Scroll to load tweet…

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇందులో మెక్ కల్లమ్ వే 158 రన్స్. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఒక్క ప్రవీణ్ కుమార్ (19) తప్ప మిగిలిన ఆటగాళ్లెవరూ (రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లి, జాక్వస్ కలిస్, వసీం జాఫర్, కామెరాన్ వైట్, మార్క్ బౌచర్ వంటి స్టార్లున్నా) కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేదు. 

కాగా ఐపీఎల్ 15 ఏండ్లు నిండిన సందర్భంగా కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఆ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. బ్రెండన్ మాట్లాడుతూ... ‘నిజం చెప్పాలంటే.. నాకు అంతా అస్పష్టంగా ఉంది. నేను తొలి మ్యాచ్ ఆడేప్పుడు తొలి పరుగు చేయడానికి 8 బంతులు ఆడాల్సి వచ్చింది. అయితే తర్వాత కొంచెం బాగా ఆడటంతో పాటు అదృష్టం కూడా తోడై సెంచరీ చేశాను..’ అని అతడు చెప్పాడు. 

Scroll to load tweet…

జై షా శుభాకాంక్షలు : 

ఐపీఎల్ 15 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా స్పందిచాడు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇదొక చక్కని వేదిక అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.