టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వారసుడిగా పంత్ జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే... పంత్ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడినా.. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో...  అతనిపై  తీవ్ర వితమర్శలు వ్యక్తమౌతున్నాయి. వికెట్ కీపింగ్ విషయంలోనూ పంత్ విఫలమయ్యాడు. దీంతో ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో.. పంత్ కి సీనియర్ క్రికెటర్ శిఖర్ థావన్ మద్దతుగా నిలిచాడు. తన గురించి వస్తున్న వార్తలను పట్టించుకోకుండా.. పంత్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని అతను సూచించాడు. ‘‘నీ గురించి మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకూ అని అతనికి తరుచూ చెబుతూ ఉంటాను. ఎందుకంటే.. మనం చూసే వార్తలు మన మనస్సులో ఉండిపోతుంది. నేను అలా ఉండటం నేర్చకున్నాను. మనం ఏదైనా మంచి చేస్తే వాళ్లు మంచి విషయాలు రాస్తారు. లేకుంటే చెడుగా రాస్తారు. నా కెరీర్ మొదట్లో కూడా నేను అలాగే ఉన్నాను. పంత్‌కి మంచి టాలెంట్ ఉంది.. అతను భవిష్యత్తులో అదరగొడతాడు’’ అని ధవన్ పేర్కొన్నాడు.

ఫాంలో లోపాల కారణంగా ధవన్ పెద్ద ఫార్మాట్‌లో జట్టుకు దూరమై.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కి మాత్రమే పరిమితమయ్యాడు. దీనిపై అతను మాట్లాడుతూ.. ‘‘తిరిగి ఫాంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా. టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టాను. నాకు అవకాశం ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్, రంజీ ట్రోఫీలో ఆడుతాను. నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండను. నేను మూడు ఫార్మాట్లు ఆడుతాను కాబట్టి.. డొమెస్టిక్ క్రికెట్ కచ్చితంగా ఆడుతాను’’ అని ధవన్ తెలిపాడు