ఉజ్జయినిలో టీమిండియా క్రికెటర్లు.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు..
INDvsNZ: ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నెగ్గిన భారత జట్టు మూడో వన్డే కోసం ఇండోర్ చేరుకున్నది. మ్యాచ్ కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

న్యూజిలాండ్ తో మూడో వన్డే ఆడటం కోసం భారత జట్టు ఇండోర్ (మధ్యప్రదేశ్) చేరుకుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.. రేపు (మంగళవారం) జరుగబోయే చివరి వన్డేలో గెలిచి మరో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. కాగా ఇండోర్ చేరుకున్న క్రికెటర్లు.. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడికి వెళ్లిన వారిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినికి వెళ్లిన ఈ క్రికెటర్లు.. తమ సహచర ఆటగాడు, ఇటీవలే కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు చేసినట్టు చెప్పారు.
గత డిసెంబర్ లో తన తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తూ రూర్కీ వద్ద కారు డివైడర్ ను ఢీకొన్న పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు మరో వారం లేదా రెండు వారాల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఉజ్జయినికి వెళ్లిన టీమిండియా క్రికెటర్లు కూడా పంత్ త్వరగా కోలుకుని తిరిగి జట్టుతో చేరాలని పూజలు చేశారు. ఉజ్జయినిలో శివలింగానికి బాబా మహాకాల్ భస్మ హారతిని అర్పించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని శివుడిని ప్రార్థించాం. తిరిగి అతడు జట్టుతో చేరడం మాకు చాలా ముఖ్యం. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ గెలిచాం. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాం..’ అని తెలిపాడు.
సూర్య, కుల్దీప్, వాషింగ్టన్ లు సంప్రదాయక దుస్తులు ధరించి పూజలు చేశారు. శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత కొంతసేపు ఆలయంలోనే గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఇండియా - న్యూజిలాండ్ సిరీస్ విషయానికొస్తే.. హైదరాబాద్ లో అతి కష్టమ్మీద గెలిచిన భారత్ రెండో వన్డేలో మాత్రం అదరగొట్టింది. రాయ్‌పూర్ వేదికగా ముగిసిన రెండో మ్యాచ్ లో అటు బంతితో బౌలర్లు రఫ్ఫాడించగా బ్యాటింగ్ లో కూడా రోహిత్, గిల్ లు కివీస్ కు ఏమాత్రం అవకాశమివ్వకుండా పనికానిచ్చేశారు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ నెగ్గింది. మూడో వన్డే మంగళవారం ఇండోర్ వేదికగా జరుగుతుంది.