ప్రస్తుతం టీమిండియా జట్టు భీకరమైన ఫామ్ లో వుంది. ఫార్మాట్ ఏదైనా... అది విదేశమా, స్వదేశమా అన్నది చూడకుండా వరుస విజయాలను అందుకుంటోంది. అలాంటి జట్టుతో సౌతాఫ్రికా మరికొద్దిరోజుల్లో తలపడనుంది. అదికూడా భారత గడ్డపై. 

కోహ్లీసేనను ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అడ్డుకోవడం అంత ఈజీ కాదు.  ఈ విషయాన్ని పసిగట్టిన సఫారీ జట్టు  పక్కా వ్యూహాలతో సంసిద్దమవుతోంది. టీమిండియా క్రికెట్ పై సమగ్ర అవగాహన వున్న వ్యక్తి  తమతో పాటే వుంటే బావుందన్నది ఆ వ్యూహాల్లో ఒకటై వుంటుంది. అందుకోసమే దక్షిణాఫ్రికా జట్టు కేవలం భారత పర్యటన కోసమే ఓ తాత్కాలిక కోచ్ ను ఎంపిక చేసుకుంది. టెస్ట్ సీరిస్ కోసం ముంబై రంజీ ప్లేయర్ అమోల్ ముజుందర్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నట్లు సఫారీ టీం మేనేజ్‌మెంట్ వెల్లడించింది. 

ఈ విషయాన్ని అమోల్ కూడా దృవీకరించాడు. '' నన్ను గతవారమే సౌతాఫ్రికా జట్టు ప్రతినిధులు కలిశారు. తమతో కలిసి పనిచేయాలని  కోరారు. టీమిండియా వంటి  బలమైన  బ్యాటింగ్, బౌలింగ్  లైనఫ్ కలిగిన జట్టుకు వ్యతిరేకంగా ప్రత్యర్థి ఆటగాళ్లను తయారుచేయడం చాలా కష్టమైన పనే. కానీ నాపై నాకు నమ్మకముంది. నన్ను నమ్మిన సౌతాఫ్రికా జట్టును మెరుగైన సేవలు అందించి వారి విజయంకోసం కృషిచేస్తా.'' అని అమోల్ తెలిపాడు. 

అమోల్ ముజుందార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డుంది. 48.13 సగటుతో ఏకంగా 11,167 పరుగులు సాధించిన అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అలాగే ఐపిఎల్ లో  రాజస్థాన్ రాయల్స్ జట్టుకు  బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం అమోల్ సొంతం.