Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: పాక్ మ్యాచ్ చూడటానికి బౌలర్లతో కలిసి వెళ్లిన రవిశాస్త్రి.. అతడిని కట్టడి చేయడానికేనా..?

India vs Pakistan: ఐసీసీ టోర్నీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఇక పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ఈనెల 24 న భారత్.. చిరకాల ప్రత్యర్థితో అమీతుమీకి సిద్ధమవుతున్నది.

indian cricket team  coach ravi shatri and bowlers watch pakistan skipper babar azam batting ahead of big clash
Author
Hyderabad, First Published Oct 19, 2021, 4:39 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021) లో భాగంగా  ఈనెల 24న భారత్-పాకిస్తాన్ (India Vs Pakistan) మధ్య జరుగబోయే మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో భారత్, పాక్.. చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం మానేశాయి. చాలా రోజుల తర్వాత వరల్డ్ కప్ వేదికగా ఆదివారం మ్యాచ్ జరుగనుంది.

అయితే అంతకముందే వార్మప్ మ్యాచ్ (T20 warmup matches) లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న వెస్టిండీస్ (west indies)తో పాకిస్తాన్ (pakistan) మ్యాచ్ ఆడగా.. ఆ మ్యాచ్ చూడటానికి భారత (india) హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi shastri)తో పాటు బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్  లు వెళ్లారు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఆడుతున్నప్పుడు రవిశాస్త్రి, భారత బౌలర్లు కన్నార్పకుండా అతడి బ్యాటింగ్ ను గమనించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ్నుంచి వెళ్లి ఇంగ్లండ్ (England)తో మ్యాచ్ కు సిద్ధమయ్యారు. కాగా.. భారత కోచ్, ఆటగాళ్లు మ్యాచ్ చూసిన దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

విండీస్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ (Pakistan captain) హాఫ్ సెంచరీతో అలరించాడు.  130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు.. బాబర్ (41 బంతుల్లో 50) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. దీంతో పాకిస్తాన్.. 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

గత కొన్ని నెలలుగా బాబర్ ఆజమ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో అతడే నెంబర్ వన్ బ్యాట్స్మెన్. దీంతో  రాబోయే భారత్-పాక్ మ్యాచ్ లో పాక్ బ్యాటింగ్ కు అతడే కీలకంగా మారాడు. బాబర్ ను ఎలా కట్టడి చేయాలో చెప్పేందుకే రవిశాస్త్రి.. భువీ, శార్దుల్, దీపక్ చాహర్ లను అక్కడికి తీసుకొచ్చినట్టు పలువురు ఫ్యాన్స్ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక  దీనిని పాక్ మీడియా కూడా ఊదరగొట్టింది. పాక్ మ్యాచ్ ను చూడటానికి వచ్చిన భారత అభిమానులు అంటూ టీవీలలో  కథనాలు ప్రసారం చేసి సంతృప్తి పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios